ఇల్లెందు, అక్టోబర్ 16 : యువత డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య డ్రగ్స్ అన్నారు. విద్యార్థి దశ నుంచే యువతకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం వల్ల డ్రగ్స్ జోలికి పోకుండా ఉంటారన్నారు.
అలాగే అందరూ తమ చుట్టూ ఉన్న విద్యార్థులు, యువత ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. వారి ప్రవర్తనలో అనుమానం అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. భవిష్యత్ తరాలకు డ్రగ్స్ రహిత సమాజాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు తాటిపాముల సురేశ్, బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు సూర్యం, హసీనా, రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Yellandu : డ్రగ్స్ దుష్ప్రభావాలపై యువత అవగాహన కలిగి ఉండాలి : డీఎస్పీ చంద్రభాను