రామవరం, జనవరి 01 : రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి రామవరంలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ నగర్ పంచాయతీలో నివాసముండే కొమ్ముల సరోజ (65) నూతన సంవత్సరం సందర్భంగా చర్చికి వెళ్లి ప్రార్థన నిర్వహించుకుని ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో రామవరం బిల్డింగ్ ఆఫీస్ వద్ద ఉన్న మహిళను టిప్పర్ లారీ (TG 28T3298) ఢీకొనడంతో మహిళ లారీ టైర్ కింద పడడంతో కుడి కాలు పూర్తిగా రోడ్డుకు అతుక్కుపోయింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కోయగూడెం నుండి రుద్రంపూర్ ఆర్ సి హెచ్ పి కి బొగ్గును రవాణా చేసే టిప్పర్ లారీలు అతివేగంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల 17న రామవరం ఎస్. సి. బి నగర్లో బొగ్గు టిప్పర్ బీభత్సం మరిచిపోకముందే తాజా ప్రమాదంలో మహిళా మృతి చెందింది. డ్రైవర్లకు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి ప్రక్కన ఫుట్‌పాత్ లేకపోవడం కూడా ఈ ప్రమాదంలో మహిళ మరణించడానికి కారణమని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పక్కల ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.