రుద్రంపూర్, ఏప్రిల్ 01 : రోజురోజుకి భానుడి ప్రభావం పెరుగుతూ ఎండలు మండిపోతున్నాయి. క్రమేపి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్లు)లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి సంవత్సరం సింగరేణి యాజమాన్యం ఏప్రిల్ 1 నుండి జూన్ 15 వరకు 75 రోజుల పాటు మొదటి, రెండవ షిఫ్టుల్లో విధులు నిర్వహించే కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే ఈసారి ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సిన మజ్జిగ పంపిణీ జరగకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనులు, మైన్స్ ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో లేవని కార్మికులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే మజ్జిగ పంపిణీ ప్రారంభించి, ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు.
సహజంగా ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కార్మికులు పనులు కొనసాగిస్తున్నారు. ఒకవైపు వైద్యులు వడదెబ్బ నివారణకు తరచూ ఎక్కువ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులకు పని ప్రదేశానికి తీసుకెళ్లేందుకు అనువుగా ఉండే కూల్ క్యాన్లను కంపెనీ పంపిణీ చేసేది. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆ సదుపాయం నిలిచిపోయిందని కార్మికులు తెలిపారు. క్వారీలో పనిచేసే ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్తే ఎండ కారణంగా అవి వేడెక్కిపోతున్నాయని, వేడినీళ్లు తాగడం వల్ల విరోచనాలు వంటి సమస్యలు వస్తున్నాయని వారు వాపోతున్నారు. అనుకున్నంత స్థాయిలో నీళ్లు తాగలేకపోతున్నామని కూడా కార్మికులు చెబుతున్నారు.
కార్మికుల సంక్షేమం మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని, వేసవి నేపథ్యంలో మళ్లీ కూల్ క్యాన్లను పంపిణీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయమై కొత్తగూడెం ఏరియా పర్సనల్ డీజీఎం వెంకట మోహన్ రావును ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా, మజ్జిగ ప్యాకెట్ల విషయంలో యూనియన్ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్యాకెట్ల నాణ్యతను వారు పరిశీలించారని, గురువారం నుండి మజ్జిగ పంపిణీ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.