జూలూరుపాడు, నవంబర్ 20 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను కట్టడి చేసి, కేటీఆర్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లాకవత్ గిరిబాబు అన్నారు. జూలురుపాడు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన సమయంలో, స్థానిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఇలాంటి పనికిరాని కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్ విచారణ పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్ష్యపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందని దుయ్యబట్టారు. అందులో భాగంగానే విచారణ పేరిట కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన కేటీఆర్ ను అక్రమ కేసులతో కట్టడి చేయగలమని అనుకోవడం అవివేకం అన్నారు. అక్రమ కేసులు పెట్టినా, ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు అయ్యేవరకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామన్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, వారు చేసే కుట్రలను న్యాయస్థానాల్లో ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు.