– బూర్గంపహాడ్ మాక్ డ్రిల్ నిర్వహణలో కలెక్టర్ అంకిత్
బూర్గంపహాడ్, మే 18 : ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్థులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు అప్రమత్తత, శాఖల మధ్య సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్‌కు ఆయన హాజరయ్యారు. తొలుత పునరావాస కేంద్రం, ఆపరేషన్ సెంటర్లు, వైద్య శిబిరాలను కలెక్టర్ పరిశీలించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. ఫైర్ సేఫ్టీ అధికారి క్రాంతికుమార్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ 6వ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన శంకర్, సీఆర్పీఎఫ్ కమాండర్ రాజేష్ దోగ్రా అబ్జర్వర్లుగా వ్యవహరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను లైఫ్ జాకెట్లు, బోట్లు సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అంబులెన్స్‌ల ద్వారా పునరావాస కేంద్రాలకు చేర్చడం, బాధితులకు తాగునీరు, భోజనం, వైద్య సేవలు, తాత్కాలిక నివాస సదుపాయాలు కల్పించడం వంటి చర్యలను డెమో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా బూర్గంపహాడ్ ఎస్సీ కాలనీ నుండి 10 మంది గర్భిణులు, 45 మంది చిన్నారులు, 26 పశువులను సురక్షితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడే బాధితులకు తక్షణ వైద్య సేవలు, ఆశ్రయం, తాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించారు. వివిధ శాఖల అధికారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, పశు సంవర్ధక శాఖల సిబ్బంది సమన్వయంతో సేవలు అందించడమే కాకుండా గజ ఈతగాళ్ల సహాయంతో చేపట్టే రెస్క్యూ విధానాలను ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు.
ఈ అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ విపత్తుల సమయంలో గోల్డెన్ అవర్‌లో తీసుకునే చర్యలు ప్రాణ రక్షణకు కీలకమని, శాఖల మధ్య సమన్వయంతో తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మాక్ డ్రిల్ ద్వారా జిల్లా యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే సామర్ధ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్‌లొ సంభవించే ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి ఇలాంటి మాక్ డ్రిల్ ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, ఏడీఏ తాతారావు, బూర్గంపహాడ్ తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, సీహెచ్‌సీ, పీహెచ్సీ వైద్యులు ముక్కంటేశ్వరరావు, నగేశ్‌తో పాటు మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

‘ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’