– వీకే కోల్ మైన్‌లో వాటర్ ట్యాంకర్ బోల్తా
– డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
– ప్రమాద వాహనాన్ని రహస్యంగా గ్యారేజ్‌కు తరలించారంటూ ఆరోపణలు
రుద్రంపూర్, మే 08 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ప్రాజెక్టులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వాటర్ ట్యాంకర్ ప్రమాదం మరోసారి గనుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. నీటిని చల్లే పనుల్లో భాగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఎం.అర్జున్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం వెంటనే సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆయన ఎడమ కాలర్ బోన్ విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వీకే కోల్ మైన్‌లో నడుస్తున్న వాహనాల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆఫ్‌లోడింగ్ పనులు చేపడుతున్న ప్రైవేట్ కంపెనీ ప్రారంభం నుండే కాలం చెల్లిన, ఫిట్నెస్ లేని వాహనాలను వినియోగిస్తోందని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగూడెం ఏరియా ఓపెన్‌కాస్ట్ మైన్లలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం దీనికే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి ముఖ్య నేత బంధువుకి చెందిన సంస్థ కావడంతోనే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం కాంట్రాక్టర్ కంపెనీలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కొత్తగూడెం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వట్టికొండ మల్లికార్జున్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “2017 కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రమాదం జరిగిన వాహనాన్ని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీడీఎంఎస్) పరిశీలించే వరకు ప్రమాద స్థలంలోనే ఉంచాలి. ఒకవేళ ఆయన రాకపోతే ఘటనకు సంబంధించిన ఫోటోలు, ఆధారాలు భద్రపరచాలి. కానీ ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని అక్కడి నుంచి గ్యారేజ్‌కు తరలించి మరమ్మత్తులు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?” అని ప్రశ్నించారు.
ప్రమాదానికి గురైన ట్యాంకర్లో సీటు బెల్ట్ లేకపోవడం, డ్రైవర్ అత్యవసర పరిస్థితిలో బయటకు రావడానికి అవసరమైన డోర్ లాక్ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడం వంటి అనేక భద్రతా లోపాలు బయటపడినట్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడల్లా హడావుడి చేసి తర్వాత మర్చిపోవడం కాదు.. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాల లోపాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది కార్మికుల ప్రాణాలతో ఆటలాడటమేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా క్యాంపులో నడుస్తున్న అన్ని వాహనాలపై సమగ్ర ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.