- బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకవత్ గిరిబాబు
– పాపకొల్లులో సర్ కార్యక్రమ పరిశీలన
జూలూరుపాడు, జూలై 03 : భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామ పంచాయతీలో శుక్రవారం కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ‘సార్’ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రతి అర్హుడికీ అందజేసి, వాటిని సక్రమంగా నింపేలా అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను సమర్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలన్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గిరిబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుత సాగు సీజన్లో రైతులకు అవసరమైన సమయంలో యూరియా కొరత సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిష్టాత్మక ‘రైతుబంధు’ వంటి పథకాల అమలులోనూ నిర్లక్ష్యం వహిస్తూ రైతాంగాన్ని గోస పెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఉత్సాహంగా కదిలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు గుమ్మడి వెంకటేశ్వర్లు, మద్దిశెట్టి ప్రకాష్, రామిశెట్టి వంశీ, రావుట్ల నరేష్ చారి, పోతిన్ని రాంబాబు, రామిశెట్టి వీరయ్య, బాదావత్ తావూరియా, నూతి శేషయ్య, గుమ్మడి మహేష్, పాల్గొన్నారు.