రామవరం, నవంబర్ 08 : అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం అంటూ గురువారం నమస్తే తెలంగాణ ఆన్లైన్లో ప్రచురితమైన కథనానికి సింగరేణి విజిలెన్స్ అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. శనివారం సింగరేణి కొత్తగూడెం సివిల్ కార్యాలయం గోడౌన్ లో ఉండవలసిన సిమెంట్ ఎలా దారి మళ్లించారు అనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా సదర్ కాంట్రాక్టర్ చెప్పిన వివరాలను లిఖిత పూర్వకంగా రాయించుకుని తీసుకున్నారు. కాంట్రాక్టర్ కి ఎంత సిమెంట్ ఇచ్చారు? ఎంత సిమెంట్ వాడాడు? పని అయిన తర్వాత గోడౌన్ లో ఎంత సిమెంటు ఉండాలి? తదితర అంశాలను అధికారులు విచారించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు పాటించారు తదితర అంశాలను థర్డ్ పార్టీ టెస్ట్ కు సిఫార్సు చేయనున్నారు. పనికోసం కేటాయించిన సిమెంట్లో సుమారు 50 బస్తాల వరకు తిరిగి ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దొరికిన బస్తాలతో పాటు ఇంకా మిగిలిన సిమెంట్ ఎక్కడ ఉందనే అనే అంశాలను పరిశీలిస్తున్నారు.