జూలూరుపాడు, ఆగస్టు 14 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. యూరియా కోరత తీర్చాలని కోరుతూ స్థానిక నాయకులతో కలిసి సహకార సంఘం అధ్యక్షుడు చీమలపాటి భిక్షం, సీఈఓ రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాసిన పరిస్థితి ఏనాడైనా చూశామా అని ఆయన ప్రశ్నించారు. సకాలంలో యూరియా, పెట్టుబడి సాయం అందజేసిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు.
గత పదేండ్ల లేని యూరియా కొరత ఇప్పుడు ఎట్లా వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ అదే పాత రోజులు పునరావృతం అవుతున్నట్లు చెప్పారు. యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కొరత తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా, భూక్యా సేవా, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.