జూలూరుపాడు, అక్టోబర్ 17 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలో ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో నాయి బ్రహ్మణ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 9ని సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టివేయడం ప్రజా వ్యతిరేకమని, అభివృద్ధి నిరోధకమని, వెనుకబడిన వర్గాలను ఇంకా వెనక్కి నెట్టేసేదిగా ఉన్న ఈ తీర్పులను తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని బీసీ జేఏసీ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చడం ద్వారా దీన్ని సాకారం చేయాలనే డిమాండ్ తో రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ప్రజాస్వామిక వాదులు, విద్యార్థి, మేధావులు జయప్రదం చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద పద్ధతులను అనుసరిస్తుందని, నోటితో పిలిచి నొసలుతో వెక్కిరించినట్లుగా ఉందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు, సిపిఎం మండల కార్యదర్శి యాస నరేష్, సిపిఐ మండల నాయకుడు ఎస్కే చాంద్ పాషా, న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వల్లోజి రమేష్, బీఆర్ఎస్ మండల నాయకుడు చేపలమడుగు రాంమూర్తి, కాంగ్రెస్ సేవాదళ్ మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల నాగరాజు, నాయిబ్రహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడియాలు శ్రీనివాస్, సిపిఐ నాయకులు గుడిమెట్ల సీతయ్య, మున్నూరుకాపు నాయకుడు ఆదిమళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.