ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్‌పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యాపార అవసరాలకు వినియోగించే కమర్షియల్ సిలిండర్ల వాడకంపై ఏకంగా 75 శాతం కోత విధించింది. వంట గ్యాస్ సిలిండర్లు కూడా బుక్ చేసిన వారం పది రోజుల తర్వాత డెలివరీ చేస్తుండగా, మళ్లీ బుక్ చేయడానికి 25 రోజుల గడువు పెట్టారు.
– మహబూబాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ)
ఇరాన్-ఇజ్రాయల్, అమెరికా యుద్ధ ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నది. రోజురోజుకూ గ్యాస్ నిల్వలు తగ్గిపోతుండంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయిల్ సంస్థలు గ్యాస్ వాడకంపై ఆంక్షలు విధించాయి. కమర్షియల్ (వ్యాపార అవసరాలు)కు వినియోగించే గ్యాస్ సరఫరాలో ఏకంగా 75 శాతం కోత విధించింది. అంతే కాకుండా వ్యాపార అవసరాల (హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు) కోసం ప్రత్యాయ్నాయం చూసుకోవాలని, విద్యుత్, బొగ్గు, కట్టెల పొయ్యి వాడాలని, పూర్తిగా కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడొద్దని సూచించింది.
ఆయిల్ సంస్థల ఆదేశాలను గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మంగళవారం అమలు చేస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఒక పెద్ద హోటల్ యజమాని నెలకు సగటున 100 కమర్షియల్ సిలిండర్లు వాడితే.., అతడికి ఇప్పుడు 25 సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తారు. ఇక వంటగ్యాస్ సిలిండర్ల వాడకంలో నిబంధనలు కఠినతరం చేసింది. ఇందులో ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ను కంపెనీలు అప్డేట్ చేశాయి. అందుకే, రెండు రోజుల క్రితం ఆన్లైన్ బుకింగ్ విధానం పని చేయలేదు.
ఒక వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ పొందిన తర్వాత తిరిగి 25 రోజులకు ఆన్లైన్లో బుక్ చేయాలి. అంతకంటే ముందే చేస్తే బుక్ కావడం లేదు. ఈ నిబంధన అమల్లోకి రావడంతోపాటు గ్యాస్ బుక్ చేసిన సమయంలో వినియోగదారుడి సెల్ నంబర్‌కు నాలుగు అంకెలగల ఓటీపీ నంబర్ వస్తుంది. డెలివరీ బాయ్ గ్యాస్ డెలివరీ చేసే సమయంలో ఓటీపీ నంబర్ చెబితేనే సిలిండర్ ఇస్తారు. లేదంటే రిటన్ తీసుకెళ్తాడు.ఈ కొత్త నిబంధనలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 89.2 డాలర్ల నుంచి 150 డాలర్లకు పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పెరిగిన భారాన్ని మోపకుండా, గ్యాస్‌పై మాత్రం పెంచింది.
కమర్షియల్ గ్యాస్‌పై రూ.115, వంటగ్యాస్‌పై రూ.60 పెంచి వినియోగదారులపై భారం మోపింది. మన దేశంలో గ్యాస్ 40శాతం తయారవుతుండగా, 60శాతం ఇరాన్, సౌదీఅరేబియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధంతో గ్యాస్ తీసుకొచ్చే నౌక మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఒక వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఒకటి, రెండురోజుల్లో సరఫరా చేసే గ్యాస్.., ప్రస్తుతం వారం రోజులు పడుతున్నది. పరిస్థితి ఇలానే ఉంటే రానున్న రోజుల్లో 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వినియోగదారులు కంగారుపడొద్దు
యుద్ధం కారణంగా ఇతర దేశాల నుంచి మన దేశానికి గ్యాస్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. వంటగ్యాస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, కమర్షియల్ సిలిండర్ల వాడకంలో కాస్త కోత విధించారు. వంటగ్యాస్ కొరత ఉందని వినియోగదారులు హడావుడిగా గ్యాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు ఒక సిలిండర్ స్టౌవ్‌కు ఉండి, మరో సిలిండర్ ఖాళీ అయిన తర్వాతనే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకునే సమయంలో వచ్చే ఓటీపీని డెలివరీ బాయ్‌కి చెప్పి సహకరించగలరు. ఓటీపీ చెప్పకుంటే గ్యాస్ ఇవ్వరు.
– పింగిలి వెంకటేశ్వర్రావు, ఆలిండియా గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షుడు