వరంగల్, మార్చి 10 : వరంగల్ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఉమ్మ డి వరంగల్ జిల్లా ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి కొండా సురేఖతో కలిసి నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడారు. వరంగల్ నగరంలో పురోగతిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు దాదాపు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నా రు. డాక్టర్లు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాల ఏర్పాటుకు సత్వర కార్యాచరణ పూర్తి చేయాలన్నారు.
భద్రకాళీ చెరువు పూడికతీత, ఆలయ మాఢ వీధుల్లో కృష్ణశిలలతో నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భద్రకాళీ చెరువు హెడ్ రెగ్యులెటర్ వద్ద ఇన్‌ఫాల్, అవుట్ఫాల్కు, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రూ.5,357కోట్లతో చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. వచ్చే నెలలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను 31లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సత్యశారద, చాహత్‌బాజ్‌పాయ్ పాల్గొన్నారు.