న్యూఢిల్లీ, జూలై 23: ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన చేపట్టడాన్ని వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నిరసనల్లో నిజాయితీ లోపించిందని అన్నారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు నిరసనకు దిగినప్పుడే కాంగ్రెస్ కూడా వచ్చి నిరసనల్లో పాలుపంచుకుని ఉండాల్సిందని ఆమె అన్నారు. నిజమైన మద్దతును చూపించటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని తప్పుబట్టారు. గురువారం ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయ నాయకులు ప్రధాని నివాసం వద్ద ప్రదర్శన చేపట్టే బదులు, జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొని ఉండాల్సిందని అన్నారు.
రాహుల్‌గాంధీ నిరసనల్లో చిత్తశుద్ధి లోపించిందని, రాజకీయ ప్రయోజనాల కోసం వాంగ్‌చుక్ ప్రతిష్ఠను వాడుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మభ్యపెట్టడం ఇక సాధ్యం కాదని, చిత్తశుద్ధి, నిజాయితీ లేనివారిని యువతే పంపించేస్తారని అన్నారు. కేవలం ప్రతీకాత్మక చర్యలకు, నిజాయితీతో కూడిన విధానానికి మధ్య తేడాను ప్రజలు గుర్తించగలరని ఆమె అన్నారు. మంగళవారం ప్రశ్న పత్రాల లీకేజ్‌కు వ్యతిరేకంగా ప్రధాని నివాసం వద్ద రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఈ నిరసనలో ఆయా పార్టీల రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పోలీసులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను బలవంతంగా అక్కడ్నుంచి తరలించటం రాజకీయంగా దుమారం రేపింది.