న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఆందోళనల వెల్లువ… కేంద్ర ప్రభుత్వం అణచివేత.. పోలీసుల లాఠీచార్జ్.. జెన్ జీ తిరుగుబాటు. కొన్ని రోజులుగా దేశంలో ప్రధాన చర్చకు దారి తీస్తున్న అంశాలు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతో దేశంలోని యువత అట్టుడుకుతున్నది. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష 27 రోజులుగా కొనసాగుతున్నది. యావత్తు దేశం నలుమూలల నుంచి యువత తండోపతండాలుగా తరలివస్తున్నది. బీజేపీ పాలనపై జరిగిన తిరుగుబాట్లలో ప్రధానమైన ఉద్యమమిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారం చేసేలా పరీక్షల నిర్వహణలో అలసత్వం కొనసాగుతున్నదంటూ ప్రజలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, టీచర్లు, విద్యావేత్తలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ మొత్తం పోరాటం సీజేపీ వేదికగా జరుగుతున్నది. మరోవైపు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన వాంగ్‌చుక్ ఎవరు? ఆయన నేపథ్యమేంటి? అనే చర్చ విస్తృతంగా నడుస్తున్నది.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన వాంగ్‌చుక్ 1988లో సొంత సంస్థ సెక్మోల్ ద్వారా లద్దాఖ్‌లోని విద్యావ్యవస్థను సమూలంగా మార్చారు. 2014లో హిమాలయ ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనేందుకు ఆయన స్థాపించిన ఐస్ స్థూప సాంకేతికత ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది.
82019లో జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటి నుంచి వాంగ్‌చుక్ ఉద్యమబాట పట్టారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడం, గిరిజన ప్రాంత రక్షణలు కల్పించడం, స్థానికులకు భూమి, ఉద్యోగాల భద్రత అందించడం లాంటి వాటి కోసం పోరాడుతున్నారు.
పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన హిమాలయాల్లో అభివృద్ధి పేరుతో భారీ గనుల తవ్వకాలు జరిగితే లద్దాఖ్ మనుగడే ప్రమాదంలో పడుతుందని సోనమ్ వాంగ్‌చుక్ బలంగా వాదిస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం గత రెండేండ్లలో రెండుసార్లు నిరాహార దీక్ష చేపట్టి, జైలు కెళ్లి ఇటీవలే విడుదలయ్యారు.