Amitabh Bachchan | బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు షూటింగ్ సమయంలో గాయమైంది. ప్రస్తుతం ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన ఎడమ మోకాలికి గాయమైనట్లు స్వయంగా వెల్లడించారు. దీంతో తాజా ఎపిసోడ్లో అమితాబ్ సాధారణంగా కనిపించే విధానానికి భిన్నంగా కూర్చునే తన ప్రసంగాన్ని ప్రారంభించారు.సాధారణంగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ వేదిక మధ్యలో నిలబడి ప్రేక్షకులను పలకరిస్తూ తన ఇంట్రో ఇస్తుంటారు. అయితే ఈసారి ఆయన వేదికపై ఉన్న సీటులో కూర్చుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
తనకు గాయం జరిగిన విషయాన్ని అమితాబ్ స్వయంగా వివరిస్తూ.. సాధారణంగా వేదిక మధ్యలో నిలబడి ప్రారంభ ప్రసంగం ఇస్తానని, అయితే షూటింగ్ సమయంలో జారిపడటంతో ఎడమ మోకాలికి దెబ్బ తగిలిందని చెప్పారు. ప్రస్తుతం ఎక్కువసేపు నిలబడటానికి కొంత ఇబ్బందిగా ఉండటంతో కూర్చుని కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే తన గాయం గురించి ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్ స్పష్టం చేశారు. గాయం అంత తీవ్రమైనది కాదని, పోటీదారులను వేదికపైకి ఆహ్వానించే సమయంలో మాత్రం తాను నిలబడతానని చెప్పారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు, కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ వరుస సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సెక్షన్ 84’ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో డయానా పెంటీ, నిమ్రత్ కౌర్, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న రెండో భాగంలోనూ అమితాబ్ బచ్చన్ తన అశ్వత్థామ పాత్రను కొనసాగించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘ఆంఖేన్ 2’లోనూ అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు సమాచారం. ఇలా ఒకవైపు సినిమాలతో, మరోవైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’తో బిజీగా ఉన్న బిగ్ బీకి షూటింగ్ సమయంలో గాయం కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే గాయం పెద్దది కాదని అమితాబ్ స్వయంగా చెప్పడంతో అభిమానులు ఊరట చెందుతున్నారు.