ఇల్లెందు, మే 01 : కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్ అన్నారు. ఇల్లెందు సింగరేణి కార్మికుల సంఘం టీజీబీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకలో రంగనాథ్ పాల్గొని మాట్లాడారు. కార్మికుల త్యాగాలతో సాధించిన చట్టాలను, హక్కులను ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టి సంఘటిత, అసంఘటిత కార్మికుల కుటుంబాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ప్రధానమైన 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి నాలుగు కార్మిక కోడ్ లను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పుడైనా ఐక్యంగా పోరాడకపోతే కార్మిక సమాజం క్షమించదన్నారు.
అలాగే 130 సంవత్సరాల చరిత్ర గల బొగ్గుట ఇల్లెందు నాణ్యమైన బొగ్గు తీస్తూ ఎన్నో అవార్డులు తీసుకున్న చరిత్రను కాలరాసే ప్రయత్నం, రాజకీయ జోక్యం అధికమవడం వల్ల సింగరేణి అస్తవ్యస్తంగా మారిందన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూసపల్లి ఓపెన్ కాస్ట్‌ను వెంటనే ప్రారంభించి. ట్రాన్స్ఫర్ అయిన కార్మికులను, ఇక్కడ ఉపాధి పొందుతున్న ఎందరో కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఇల్లెందులో మే డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే ఓసి ఇన్చార్జి ఎండీ షాకీర్, ఇల్లెందు ఏరియా టీబీజీకేఎస్ నాయకులు ముఖేష్ పాసి, రాసపల్లి శ్రీనివాస్, మహేష్ ,ఇమ్రాన్, గడ్డి శీను, ముత్యం పాల్గొన్నారు.