ఇల్లెందు, ఏప్రిల్ 14 : చోరీ కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి బంగారం, వెండి రికవరీ చేశారు. చోరీ కేసు వివరాలను ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ బత్తుల సత్యనారాయణతో కలిసి డీఎస్పీ చంద్రబాను సోమవారం వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన ఇల్లెందు పట్టణం సివిల్ లైన్ సత్యనారాయణపురం రోడ్డులో గల ఓ ఇంట్లో చోరీ జరిగింది. బంగారం, వెండి అపహరణకు గురైనట్లు బాధితులు 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో మూడు టీమ్లుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. కాగా సోమవారం ఇల్లెందు పట్టణం బుగ్గవాగు బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఓ యువకుడు బ్యాగేసుకుని కనిపించాడు. పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటపడి పట్టుకున్నారు.
తనిఖీ చేయగా బ్యాగులో 19.99 తులాల బంగారం, 20 తులాల వెండి కనుగొన్నారు. దాని విలువ రూ.7.10 లక్షలుగా తెలిపారు. నిందితుడు కోరి రాహుల్ (23) ఉప్పుగూడ, హైదరాబాద్కు చెందిన వ్యక్తి. మీర్పేట్, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో చోరీ చేసినట్లు తేలింది. మూడుసార్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇల్లెందు సీఐ ఆధ్వర్యంలో కేసును 24 గంటల్లో చేధించినందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పలువురు పోలీసులకు రివార్డు ప్రకటించారు. డీఎస్పీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగుల్ మీరా, సూర్య పాల్గొన్నారు.