రామవరం, నవంబర్ 10 : 150 మస్టర్ల గైర్హాజరు సర్కులర్‌పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా పాత విధానాన్నే కొనసాగించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. దీనికి సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని యాజమాన్యం తెలిపిందన్నారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో యాజమాన్యం మధ్య జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు పరచుటకు ఏర్పాటైన అధికారిక కమిటీలో యూనియన్ మెంబర్స్ ను కూడా తీసుకుని విధి విధానాలు నిర్ణయించి త్వరగా సమస్యను పరిష్కరించుటకు ఒప్పుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కార్మికులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినందున త్వరలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే గోదావరి ఖనిలో క్యాతలాబ్ (గుండె జబ్బుల) హాస్పిటల్ కూడా వచ్చే నెలలోపు ప్రారంభిస్తామని తెలిపారన్నారు. బదిలీ వర్కర్లుగా అపాయింట్మెంట్ అవుతున్న ఉద్యోగులందరూ ఇకనుండి జనరల్ అసిస్టెంట్ ట్రైనీగా నియమించబడతారన్నారు.
పెరిక్స్ (అలవెన్స్) లపై పడే ఇన్కమ్ ట్యాక్స్ ను యాజమాన్యమే భరించాలనే విషయాన్ని ప్రభుత్వ అనుమతి తీసుకుని పరిష్కరించుటకు ఒప్పుకున్నట్లు, మెడికల్ బోర్డును యధాతథంగా కొనసాగించుటకు నిర్ణయం తీసుకున్నారు. జే ఎం ఓ 62, ఫోర్ మెన్ (మెకానికల్) 12, ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) 41, సూపర్వైజర్ (సివిల్) 1, ఆఫీస్ సూపరిండెంట్ 4, స్టాఫ్ నర్స్ 86, జూనియర్ అకౌంటెంట్ 1 లకు A1 గ్రేడ్ వారికే కాకుండా ఏ గ్రేడ్ లో ఐదు సంవత్సరాల సర్వీస్ కలిగిన పై వారందరికీ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు ఒప్పుకున్నట్లు, డెసిగ్నేషన్స్ మార్పు విషయమై మార్చి లోపల కోల్ ఇండియా కమిటీ రిపోర్ట్ ప్రకారం మార్చుటకు నిర్ణయం జరిగిందన్నారు.
కార్మికుల మారు పేర్ల విషయంలో ఒక్కొక్క కేసును విడివిడిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని, పర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు 9 మందికి రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు అంగీకరించారు. అంతేకాకుండా కార్మికుల సౌలభ్యం కోసం అన్ని గనుల్లో కార్మికులకు కప్‌బోర్డులు, లాకర్స్ ఏర్పాటు చేయుటకు సర్కులర్ జారీ చేయనున్నారు. వెయ్యి లోపు పెన్షన్ పొందుతున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ అయిన రూ.2,016 ఇప్పించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తిరుమల్‌రావు, సంబంధిత జనరల్ మేనేజర్లు, గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు కె.సారయ్య, కె.వీరభద్రయ్య, వై వి రావు, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శులు అక్బర్ అలీ, వంగ వెంకట్ పాల్గొన్నారు.

Ramavaram : మెడికల్ బోర్డును యధావిధిగా కొనసాగించాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు