ఇల్లెందు, డిసెంబర్ 31 : వినియోగదారులకు న్యాయమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ అన్నారు. బుధవారం ఇల్లెందు మండలం కొమరారంలో విద్యుత్ శాఖ పల్లె బాటలో భాగంగా 132/33 కే.వి ఇల్లెందు ఉప కేంద్రాన్ని పరిశీలించారు. సీఈ ఆపరేషన్ రాజు చౌహన్, డీఈ స్వామితో కలిసి కొమరారం గ్రామంలో పల్లె బాట నిర్వహించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతులు బోర్ మోటారల దగ్గర తప్పనిసరిగా కెపాసిటర్ లు అమర్చుకోవాలని, రైతులు తమంతటా తాము ఎటువంటి రిపేర్ లు చేయవద్దన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా 1912 కు ఫిర్యాదు చేయాలన్నారు. విద్యుత్ భద్రత గురించి అవగాహన కల్పించారు. కొమరారం 33/11 కే.వి ఉప కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆపరేషన్ మహేందర్, డీఈ ఆపరేషన్ రంగస్వామి, డీఈ ఎంఆర్టీ వెంకటేశ్వర్లు, ఏడీఈ ఆపరేషన్ ఇల్లెందు రామారావు, ఏఈ ఆపరేషన్ ఇల్లెందు రూరల్ హనీషా, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.