– సారపాక సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్
బూర్గంపహాడ్, ఆగస్టు 21 : పారిశ్రామికవాడ సారపాకలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సారపాక మేజర్ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో జమలారెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సారపాక ప్రధాన రహదారికి ఇరువైపులా, అంతర్గత రహదారుల వెంబడి, ఖాళీ ప్రదేశాల్లో నీడనిచ్చే, పండ్లను అందించే, పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలను నాటించారు. మొక్కలు పచ్చదనానికే పరిమితం కావని, మానవ జీవనానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. రహదారుల వెంబడి చెట్లు పెంచడం వల్ల వేసవి సమయంలో పుణ్యక్షేత్రమైన భద్రాచలం వచ్చి పోయే భక్తులు, ప్రయాణీకులు, పాదచారులకు వృక్షాలుగా మారి నీడనివ్వడంతో పాటు సేద తీరుస్తాయన్నారు.
పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో సారపాక అంతటా మొక్కలు నాటించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మొక్కలు నాటించడంతో పాటు వాటి సంరక్షణకు కంచె ఏర్పాటు చేయడం జరుగుతుందని, నిరంతరణ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, ఈవో గుగులోత్ రవికుమార్, నాయకులు పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, బాలి శ్రీహరి, పేరాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పాటి అశోక్, తిరుపతి ఏసోబ్, మూల నవ్యశ్రీ, కొమరం సావిత్రి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.