పాల్వంచ, ఏప్రిల్ 26 : పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను ఎందుకు ఓడగొట్టుకున్నామని ప్రజలు మదన పడుతున్నారని, మళ్లీ ఆయనే సీఎంగా రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం అలివి కానీ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోగా రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ సక్రమంగా చేయకుండా మహిళలకు, కూలీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాక్షస, దుర్మార్గపు, అవినీతి పాలన తమకొద్దని అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఓట్లేసి అధికారం అప్పగిస్తే వారి బతుకులు బాగు చేయకపోగా ఆగంఆగం చేశారని, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడు పోతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. తన 42 ఏళ్ల రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ఎందరో ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని, కానీ ఇలాంటి సీఎంని చూడలేదన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేసే పరిస్థితి కూడా లేదని, ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేపడితే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయోనని సీఎం భయాందోళనకు గురవుతున్నట్లు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అరాచకాల వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికల పెడితే కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోవడం ఖాయమన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆదివారం 27వ తేదీ ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి భారీ సంఖ్యలో వాహనాల్లో వరంగల్‌కు తరలివెళ్లనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, వనమా రాఘవేందర్రావు, పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, మల్లెల శ్రీరామ్ మూర్తి, పూసల విశ్వనాథం, కాంపల్లి కనకేశ్, మల్లెల రవిచంద్ర, మడివి సరస్వతి, డిష్ నాయుడు, కొత్వాల సత్యనారాయణ, దొడ్డ సురేశ్, బత్తుల మధుచంద్, కాల్వ ప్రకాశ్‌రావు, దాసరి నాగేశ్వరరావు, భూక్య చందూనాయక్, సమ్మయ్య గౌడ్, జూపల్లి దుర్గాప్రసాద్, కొత్త హర్ష, ముత్యాల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.