కొత్తగూడెం అర్బన్, మే 15 : అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగేదేమున్నదని, ఈ పోటీల నిర్వహణ వల్ల వరంగల్, హైదరాబాద్ ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?, సీఎం రేవంత్ రెడ్డి తుగ్గక్ నిర్ణయాల వల్ల దేశంలో తెలంగాణ పేరు అధఃపాతాళానికి పడిపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందాల పోటీలను రూ.200 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నారని, వాటి వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలేమైనా పెరుగుతాయా?, వస్తాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందాల భామలు వరంగల్ వస్తున్నారని మోరీలు కనపడకుండా పరదాలు కట్టారని, రోడ్డు వెంట ఉన్న చిరువ్యాపారుల దుకాణాలను అక్కడి నుంచి ఎత్తేశారని ఇది ఎంతవరకు సమంజసమన్నారు.
వరంగల్ కు వచ్చిన అందాలభామల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడమేమిటని, దీనిని తెలంగాణ సమాజం ముమ్మాటికి వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో బానిసత్వపు ఆనవాళ్లు ఇంకా పోలేదని విమర్శించారు. రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ వారసులైనా, సమ్మక్క- సారక్కల పౌరుషంతో పోరాటం చేసిన ఈ గడ్డలో ఆడబిడ్డలను చులకనగా చూసి, కాళ్లు కడిగించిన ఘటన యావత్ సమాజాన్ని నివ్వెరపోయేలా చేసిందన్నారు. ఈ ఘటనపై తక్షణం సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ ప్పాలని, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోరాటల పురిటిగడ్డలో ఆడబిడ్డలను అవమానించిన కాంగ్రెస్ సర్కార్ ను చరిత్ర క్షమించదని దీనిని ఎన్నటికీ మరువబోమన్నారు.
అతిథి దేవోభవ అంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఎవరినైనా గౌరవిస్తామని, మర్యాదనిస్తామని కానీ కాళ్లు కడిగే కొత్త సాంప్రదాయాన్ని రేవంత్రెడ్డి తీసుకువచ్చారని, ఇది ప్రపంచం ముందు తెలంగాణ, భారతదేశ గౌరవాన్ని మంటగలపడమేనన్నారు. విదేశీయురాలైన సోనియా, రాహుల్ ల మెప్పు కోసం సీఎం రేవంత్ ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ-రేస్ నిర్వహిస్తే రూ.700 కోట్ల వ్యాపారం జరిగిందని, అనేక మంది దేశంలోని క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు, సినీనటులు ఈవెంట్ కు వచ్చినట్లు తెలిపారు. కానీ అందాలపోటీల వల్ల ఏం లాభం లేదన్నారు. పంటలు పండక, పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయక రైతు బక్కచిక్కి శల్యమైపోతున్నాడని, వారికి భరోసానిచ్చే విధంగా పరిపాలన చేయాల్సింది పోయి తుగ్లక్ నిర్ణయాలతో పాలనను ఆటకెక్కించారని దుయ్యబట్టారు.
ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయలేకనే అందాల పోటీలంటూ తెరమీదకు తీసుకువచ్చి సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పటాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందినదిగా చూపిస్తే, కాంగ్రెస్ సర్కార్ పరిపాలన చేతకాక దేశంలోనే జీరో స్థాయికి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మడం లేదని, అప్పు పుట్టడం లేదని తప్పించుకుంటున్నారని కానీ బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదలదని, ఇచ్చిన హమీలు నెరవేర్చేదాక ఉద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగుల వెంట ఉండి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. సరస్వతి పుష్కరాల్లో కటౌట్ కట్టారని, సీఎం, మంత్రుల కాళ్ల కింద సరస్వతి దేవతామూర్తుల చిత్రాలు పెట్టడమేమిటి, ఈ చర్య ముమ్మాటికి దేవుళ్లను అవమానించడమేనన్నారు. బుద్ధి, జ్ఞానం లేకనే ఇలాంటి చౌకబారు పనులకు పాల్పడుతున్నారన్నారు.
ఇక ఎన్నికల్లో సింగరేణి ఉద్యోగులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి కార్మికులతో ఓట్లేయించుకుని హామీని నెరవేర్చలేదని, ఆదాయ పన్ను రద్దు చేపిస్తానని చెప్పి తప్పించుకుంటున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలోపు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేనిపక్షంలో రేవంత్, ఆయన మంత్రి వర్గాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, కౌన్సిలర్లు, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, సీనియర్ నాయకులు తొగరు రాజశేఖర్, వేముల ప్రసాద్ బాబు, పల్లపు రాజు, సింధు తపస్వి, రామిళ్ల మధుబాబు, ఖాజా భక్ష్, సతీశ్, మునీర్, పురుషోత్తం, పూర్ణచందర్, జయరాం పాల్గొన్నారు.