రుద్రంపూర్, మార్చి 27: సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా చేపడుతున్న కారుణ్య నియామకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజీకేఎస్) నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో గోల్డెన్ హ్యాండ్‌షేక్ పేరుతో వేలాది మంది కార్మికులను తొలగించిన విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని టిబిజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ఆరోపించారు.
కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజీకేఎస్) ఆధ్వర్యంలో సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణ నిలిపివేతపై అంశంపై సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, ఇల్లందు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జాఫర్ హుస్సేన్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాపు కృష్ణ కాంగ్రెస్ తీరును విమర్శించారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగిన నియామకాల్లో అవకతవకలు జరిగాయనిని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. గత రెండేళ్లుగా విజిలెన్స్, ఏసీబీ విచారణల పేరుతో కాలయాపన చేస్తూ.. అనారోగ్యంతో ఉన్న కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవకుండా ఏకంగా బోర్డునే నిలిపివేయాలని ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
సింగరేణి వ్యాప్తంగా సుమారు 2000 మంది అనారోగ్యంతో బాధ పడుతున్న కార్మికులు, ముఖ్యంగా చివరి దశ సేవలో ఉన్నవారు గత సంవత్సరం నుంచి మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారన కాపు కృష్ణ తెలిపారు. రెగ్యులర్ మెడికల్ బోర్డు లేకపోవడంతో అనేకమంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలని, సంస్థను పరిరక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కాపు కృష్ణ పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి భవన్, ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.