– బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్
భద్రాచలం, ఆగస్టు 17 : పేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయకుండా నిరంతరం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భద్రాచలం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, మాజీ ఇన్చార్జి మానే రామకృష్ణ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండగా నిలిచాయని కొనియాడారు. ఈ పథకాలను రద్దు చేయకుండా నిరంతరాయంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకుని నెలల తరబడి పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే చెక్కులు మంజూరు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయొద్దు’