– గంటసేపు ఆలస్యంగా ప్రారంభం
– కేవలం నాలుగే అప్లికేషన్లు దాఖలు
– ప్రచారం లేక స్పందన కరువు
భద్రాచలం, ఆగస్టు 17 : భద్రాచలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ప్రజాదరణ లేక బోసిపోయింది. అధికారుల నిర్లక్ష్యం, సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజలు రాక ఈ కార్యక్రమం వెలవెలబోయింది. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10:00 గంటలకే ప్రారంభం కావాల్సిన ప్రజావాణి అధికారుల ఆలస్యం కారణంగా 11:00 గంటలకు ప్రారంభమైంది. మరోవైపు ప్రజావాణి నిర్వహణపై భద్రాచలంలో ఎలాంటి ముందస్తు ప్రచారం కల్పించక పోవడంతో ప్రజలకు సమాచారం లేకుండా పోయింది. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు రాకపోవడంతో రోజంతా కలిపి కేవలం నాలుగు వినతి పత్రాలు (అప్లికేషన్లు) మాత్రమే అధికారులకు అందాయి. అధికారుల సమయపాలన రాహిత్యం, ప్రజావాణిపై సమాచార లోపం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్దిష్ట సమయానికి ప్రారంభించేలా, విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.