UP Judge : ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) లోని ముజఫర్నగర్ కోర్టు (Muzaffernagar Court) సంచలన తీర్పులతో వార్తల్లో నిలిచింది. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (Sessions Court Judge) రవి కుమార్ దివాకర్ (Ravi Kumar Diwaker) గత నాలుగు నెలల్లో విచారించిన 10 కేసుల్లో.. ఏకంగా 22 మందికి మరణశిక్ష (Death Sentence) విధించారు. న్యాయవాది హత్య నుంచి కిడ్నాప్, దోపిడీ వంటి పలు కేసుల్లో దోషులుగా తేలిన వారికి ఈ శిక్షలు పడ్డాయి.
గతంలో బరేలీలో పనిచేసిన సమయంలోనూ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్.. 13 మందికి మరణశిక్ష విధించారు. దాంతో ఇప్పటివరకు ఆయన విధించిన మరణశిక్షల సంఖ్య 35కు చేరింది. 2022లో వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదు సముదాయంలో వీడియో సర్వేకు ఆదేశించి ఆయన జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల కాలంలో వరుసగా మరణశిక్షలు విధించడంతో ‘అత్యంత అరుదైన కేసుల్లోనే’ ఈ శిక్ష విధించాలన్న న్యాయసూత్రంపై చర్చ మొదలైంది.
అయితే సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్ష తుదితీర్పు కాదు. హైకోర్టు ధ్రువీకరించిన తర్వాతే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హైకోర్టు సెషన్స్ కోర్టు విధించిన శిక్షను ధృడపర్చినా పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.