– కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకుల ధర్నా
– అధికారులకు వినతిపత్రం సమర్పించేందుకు అనుమతి నిరాకరణ
– దీంతో నీవే కాపాడుకోవాలని తల్లి సింగరేణికి వినతి
కొత్తగూడెం సింగరేణి, జనవరి 21 : సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వ జోక్యం తగ్గించుకోవాలని సైట్ విజిట్ విధానంతో పిలిచిన టెండర్లను అన్నింటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరొక మంత్రి కలిసి సింగరేణిలో సైట్ విజిట్ విధానాన్ని ప్రవేశపెట్టి తమ బంధువులకు, శ్రేయోభిలాషులకు సింగరేణి సొమ్మును దోచిపెట్టేందుకు తెర లేపారని విమర్శించారు. సైట్ విజిట్ విధానంతో తమ అనుయాయులకు అడ్వాన్స్‌గా ఎలా టెండర్లను ఇవ్వాలని దురాలోచనతో ప్రవేశపెట్టిన విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.

Kothagudem Singareni : ‘సింగరేణిలో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలి’
తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయం పుట్టిన సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకే సింగరేణి సొమ్మును ప్రభుత్వ సోకులకు ఏటీఎంగా ఉపయోగించుకుంటుందన్నారు. సైట్ విజిట్ విధానం వల్ల కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఆ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి నైని బ్లాక్‌తో పాటు మిగిలిన ఏడు బ్లాకులకు కూడా మళ్లీ రీటెండర్ పిలువాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అక్రమ టెండర్ల విషయమై ప్రశ్నించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును సిట్ పేరుతో ఇబ్బందులకు గురిచేసి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం సైట్ విజిట్ విధానాన్ని ఎలా అంగీకరించిందని, దీనిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగరేణిలో మాత్రమే ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దుచేసి సిబిఐ చే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు మరో పోరాటం తప్పదని హెచ్చరించారు.

Kothagudem Singareni : ‘సింగరేణిలో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలి’
అనంతరం సింగరేణి అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా భారీ ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నడూ, ఎప్పుడు లేని విధంగా వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించక పోవడం సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్నదనడానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. పోలీసులు అనుమతించక పోవడం వల్ల హెడ్ ఆఫీస్ ముందు ఉన్న సింగరేణి తల్లికి టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ వినతి పత్రం సమర్పించి సింగరేణిని నీవే కాపాడుకోవాలి తల్లి అని ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్, కౌన్సిలర్లు సత్తుపల్లి, చండ్రుగొండ, మాణుగూరు ఏరియాల టీబీజీకేఎస్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.