కొత్తగూడెం:సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలిఅర్థ సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్భుతమైన వృద్దిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇదే కాలానికి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుతో పోల్చితే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు రవాణాలో 75 శాతం, బొగ్గు ఉత్పత్తిలో 65 శాతం, ఓవర్ బర్డెన్ తొలగింపులో 26 శాతం వృద్దిని నమోదు చేసింది. దీనిపై సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదే ఒరవడితో రానున్నఆరునెలల్లో చక్కని వృద్దిని నమోదు చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 700 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి చరిత్రలో సరికొత్త మైలురాయి దాటాలని పిలుపునిచ్చారు. గత ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సింగరేణి 179 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా, ఈ ఏడాది అదే కాలానాకి 75 శాతం వృద్దితో 313 లక్షల టన్నుల బొగ్గు రవాణాను కంపెనీ సాధించింది. గత ఏడాది ఆరు నెలల్లో 181 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా ఈ ఏడాది 299 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. వర్షాలున్నప్పటికీ సెప్టెంబర్ నెలలో వృద్ది సాధించిందని చెప్పారు.