– మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి
– జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ ధర్నా
రుద్రంపూర్, మార్చి 30 : సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, గత సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న 2 వేలకు పైగా కార్మికులకు న్యాయం చేయాలని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికుల సహనం ఇప్పుడు ఆవేదనగా మారిందన్నారు. అర్హత ఉన్నప్పటికీ అన్‌ఫిట్ చేయకుండా పెండింగ్‌లో ఉంచిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జూలై, నవంబర్ నెలల్లో అర్హత ఉన్నప్పటికీ అన్‌ఫిట్ చేయని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలన్నారు. విజిలెన్స్‌లో పెండింగ్‌లో ఉన్న మారుపేరుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు తక్షణమే అమలు చేయాలని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను సింగరేణి యాజమాన్యం మానుకోవాలని హెచ్చరించారు. అలాగే వీకే కోల్ మైన్ లో సింగరేణి ఉద్యోగుల ద్వారానే బొగ్గు ఉత్పత్తి చేయించాలన్నారు. వీకే కోల్ మైన్‌లో సింగరేణి యంత్రాలు, సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు వెలికి తీయాలని, కొత్తగూడెం ఏరియాలో సర్ఫేస్‌లో ఉన్న ఖాళీలను పీవీకే–5 అండర్‌గ్రౌండ్ కార్మికులతో పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జేవీఆర్‌ఓసీలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కార్మికులందరినీ వీకే కోల్ మైన్‌కు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ సభ్యులు బోరింగ్ శంకర్, బురుగుల రవికుమార్, ఎంటెక్ మహేందర్, కంచర్ల శ్రీనివాస్, నెమల్ల వెంకటేశ్వర్లు, సూరజ్, జిమ్మిడి అనుదీప్, మారపాక తిరుపతి, రాజేష్, అహరోన్, పిచ్చయ్య, అమరేందర్, సత్యనారాయణ, అనుదీప్ బాల, రఫీ, ఎం. శ్రావణ్ కుమార్, కే శ్రీనివాస్, రవివర్మ, సుధీర్ కుమార్, సూరిబాబు, అమృతరావు, సందేశ్, హరి, దీపక్, సుందర్‌లాల్, సుధాకర్, సంతోష్, తాతరావు, రాజ్‌కుమార్, షణ్ముఖ్, సమీర్, షోయబ్, రాజు పాల్గొన్నారు.

‘సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి’