ఇల్లెందు, ఫిబ్రవరి 21 : సమాజ నిర్మాణంలో సేవా గుణమే గొప్పదని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల- ఇల్లెందు ఎన్ఎస్ఎస్ విభాగం శీతాకాల ప్రత్యేక శిబిరం 7 రోజుల క్యాంప్‌లో భాగంగా నాల్గొవ రోజు మోదుగులగూడెం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న క్యాంప్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో పాల్గొంటున్న ప్రతి వాలంటీర్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారే తర్వాత ప్రజా నాయకులుగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కళాశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల కోసం ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానన్నారు. త్వరలోనే కళాశాల అభివృద్ధికి కావాల్సిన అన్ని వసతులను సమకూర్చుతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల 2026-27 విద్యా సంవత్సరం అడ్మిషన్లు పెంచే కార్యక్రమంలో భాగంగా అడ్మిషన్స్ బ్రోచర్ ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వై.చిన్నపయ్య, బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఆరెం కిరణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ ఆఫీసర్ తోడేటి రాజు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. ప్రభాకర్ రావు, డాక్టర్ బి.శ్రీదేవి, డాక్టర్ బి.నాగేశ్వరరావు, పి.కృష్ణవేణి, డాక్టర్ రాకేష్ శ్రీరామ, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, బి.సరిత, టి.సురేందర్, బి.కరుణాకర్, ఎస్.ఈశ్వర్, డాక్టర్ జి.రామారావు, డి.వెంకటేశ్వర్లు, టి. శ్రీకాంత్, పి.లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

సమాజ నిర్మాణంలో సేవా గుణమే గొప్పది : ఎమ్మెల్యే కోరం కనకయ్య