సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) :సిటీ రియాల్టీకి కాంగ్రెస్ సర్కారు పనితీరు గ్రహణంలా మారింది. రియల్ అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతుందని ఆశించిన జనాలపై ఏదొక పిడుగు పడుతూనే ఉంది. హైదరాబాద్ ప్రజలు, రియల్టర్లను సంక్షోభంలో నెట్టివేసింది. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల అస్తవ్యస్త వైఖరితో గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పడకేసింది. ప్రస్తుతం నగరం చుట్టూ పక్కల భూముల కొనుగోలు, అమ్మకాలు జరిపే వారికి ఏదీ ప్రభుత్వ భూమి? ఏదీ పట్టా భూమి అనేది సంబంధం లేకుండా సర్కారు రెవెన్యూ అధికారాలను విచక్షణ లేకుండా ప్రయోగిస్తుంది. హైదరాబాద్ రియాల్టీని దెబ్బకొట్టడమే లక్ష్యం గా ఉన్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులకే అంతు చిక్కని రీతిలో మనుగడలోని నిబంధనలను తెరమీదకు తీసుకువస్తూ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఛిన్నాభిన్నం చేస్తున్నది. గడిచిన రెండున్నరేళ్లలో అమ్మకాలు అట్టడుగు స్థాయికి పడిపోతూనే ఉన్నా… సర్కారు పనితీరులో, పాలసీ విధానాల్లో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు.
ఇప్పుడేమో యూఎల్సీ దస్త్రం
గడిచిన ఆరు నెలల కాలంగా నగర శివారుల్లో రియల్ ఎస్టేట్‌ను కాంగ్రెస్ సర్కారు ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది. ముందుగా రాత్రికి రాత్రే వేలాది స్థిరాస్తులను నిషేధిత జాబితాలో చేర్చి వేధింపులకు తెరలేపిన సర్కారు..ఇప్పుడు మనుగడలో లేని అర్బన్ ల్యాండ్ సీలింగ్ దస్ర్తాన్ని ప్రయోగించింది.. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదీగూడ వంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇండ్లు నిర్మించుకుని 30-40ఏళ్లు గడిచిపోతే… ఇప్పుడు అవసరానికి అమ్ముకునే వీల్లేకుండా ఆస్తులపై యూఎస్సీ రూపంలో ఓ పిడుగేసింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లిన భూ యజమానులకు గుండెల్లో గునపం దిగినంత పనవుతుందనీ వాపోతున్నారు. నిమిషాల్లో తమ స్థిరాస్తుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న సర్కారు… యూఎల్సీ దస్ర్తాల పేరిట ఎన్వోసీలు కోరుతోంది. ఇందులో ఫ్లాట్లను కూడా వదలకుండా ఇండ్లకు కూడా జాబితాలో చేర్చి ఎన్వోసీ ఉంటే తప్పా క్రయవిక్రయాలకు ఆస్కారం లేదనీ చెబుతున్నది. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సర్వే నంబర్ మొత్తానికి ఒక్క ఎన్వోసీతో పోయేదానికి ఎందుకు ఒక్క ప్లాట్ల వారీగా, ఫ్లాటు వారీగా ఎన్వోసీ అడుగుతున్నారని నేరుగా అధికారులను ప్రశ్నించినా రిజిస్ట్రిషన్లను చేయకుండా వేధిస్తున్నారని మండిపడుతోంది.
ఈస్ట్ సిటీపై వరుస పిడుగులు…
ఈస్ట్ సిటీపై సర్కారు వరుస పిడుగులు వేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఆరు నెలలుగా ఈ వ్యవహారం సర్కారు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. మొన్నటివరకు నిషేధిత జాబితాలో చేర్చి… నేరుగా కలెక్టర్ల నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలంటూ వేధించిన సర్కారు..ఇప్పుడు యూఎల్సీ భారాన్ని మోపి… జనాలను ముప్పుతిప్పలు పెడుతున్నది. ముఖ్యంగా ఏ చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్తులను, ఎన్నో ఏండ్లుగా ఉంటున్న భవనాలకు యూఎల్సీ కావాలని ఆడుగుతున్నారంటూ మండిపడుతోంది. బాధితులకు నెలలు గడుస్తున్నా… ల్యాండ్ క్లియరెన్స్ పత్రాలు లభించకపోవడంతో… దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తమే ఉందనీ, రెవెన్యూ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు, బంధులు కలిసి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్‌ను నియంత్రిస్తున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కనీసం సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చే ఉన్నతాధికారులు లేరనీ, ఎన్నో రోజులు సాధారణ, పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదనీ, వేధింపులు మాత్రం తప్పడం లేదని మండిపడ్డారు. గడిచిన ఆరు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులపై సర్కారులో పట్టించుకునే నాథుడే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.