రుద్రంపూర్, ఫిబ్రవరి 10 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్‌లో పైప్‌లైన్ పనుల పేరిట ఇష్టానుసారంగా రోడ్లను తవ్వడంపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ ఖని ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం రుద్రంపూర్‌లో ఉన్న ఫిల్టర్ బెడ్‌ను భవిష్యత్‌లో తొలగించనున్న నేపథ్యంలో గౌతంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్‌కు నీటి సరఫరా చేసేందుకు పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా రుద్రంపూర్ నుండి గౌతంపూర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డును, ముఖ్యంగా రుద్రంపూర్ జడ్పీ స్కూల్ ప్రాంతం నుండి ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా తవ్వుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే కార్మిక ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి జరగక సంవత్సరాలు గడిచిపోయిన పరిస్థితిలో ఉన్న కొద్దిపాటి రోడ్లను కూడా ఇలా తవ్వడం వల్ల భవిష్యత్‌లో సింగరేణి యాజమాన్యం రోడ్లు పునర్నిర్మిస్తుందా అనే అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి. పైప్‌లైన్ నిర్మాణం అవసరమైనప్పటికీ, రోడ్లకు నష్టం కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని, తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.