రామవరం, ఆగస్టు 01 : వీకేఓసీ పనులను త్వరగా ప్రారంభించి, ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన కార్మికులను వెనక్కి తీసుకురావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ కోరారు. శుక్రవారం జీఎం షాలెం రాజుతో వీరు సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. ఓవర్ బర్డెన్ పనులు మాత్రమే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి, బొగ్గు తవ్వకం పనులను సింగరేణి సంస్థే నిర్వహించాలని కోరారు. పీవీకే గని కార్మికులకు ప్రాధాన్యం ఇచ్చి, వారి సీనియారిటీ ప్రకారం సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లను వీకేఓసీలో సర్దుబాటు చేయాలన్నారు. వర్క్‌షాప్‌లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, క్యాంటీన్, ఆర్ఓ ప్లాంట్, ఫోర్క్ లిఫ్టర్ వాహనాలను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలపై జనరల్ మేనేజర్ షాలెం రాజు సానుకూలంగా స్పందించారు. త్వరలో షావల్ యంత్రాలు వస్తాయని, వీకేఓసీ పనులు ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి పెంచుతామని తెలిపారు. డిప్యుటేషన్‌పై వెళ్లిన కార్మికులను కూడా వెనక్కి పిలిచి ఇక్కడే సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కార్మికులకు పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా ఇన్‌ఛార్జి బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాస్వామి, పీవీకే పిట్ కార్యదర్శి హుమాయూన్, సివిల్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్, వీ కే వర్క్ షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్, కమల్ పాల్గొన్నారు.