కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 21 : తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కవచం ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే అని, కాంగ్రెస్, బీజేపీ లకు నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు(Rega Kantha Rao) ఆరోపించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలను నాశనమయ్యాయని, ప్రజలు ఆనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా నాయకులు సీఎం కుర్చీ కోసం పాకులాడుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ జలాదోపిడి చేస్తుంటే ఏమి చేయకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కృష్ణా బోర్డులో మనకు రావాల్సిన వాటా పట్టించుకోకుండా ఆంధ్రప్రాంత సీఎం చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని, బీజేపీ నాయకులు కూడా నోరు మెదపకుండా ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబును, కేంద్రాన్ని అడిగే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.
వెంటనే త్రీ మెన్ కమిటీ వేయాలని, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఢిల్లీ ధర్నా చేయాలని అందులో తాము పాల్గొంటామని తెలిపారు. పదేళ్లు పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్ష్టం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు, రైతుల గురించి అలోచించి పాలన సాగించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ మెచ్చ నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిందిగల రాజేందేర్, కాపు సీతాలక్ష్మి, వేల్పుల దామోదర్, రావులపల్లి రాంప్రసాదరావు, కొట్టి వేంకటేశ్వర రావు, సంకుబాపన అనుదీప్, ప్రసాద్ గౌడ్, సింధు తపస్వి, తదితరులు పాల్గొన్నారు.