- జూలూరుపాడు ‘రోడ్ సేఫ్టీ గ్రామసభ’లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
- గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీలు, సీసీ కెమెరాలు తప్పనిసరి
- నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కఠిన చర్యలు
- గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జూలూరుపాడు, జూన్ 10 : దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగానే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే వీటి నివారణ సాధ్యపడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని యల్లంకి గార్డెన్స్‌లో ‘రోడ్ సేఫ్టీ గ్రామ సభ’ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన తదితర అంశాలపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు.
సరుకు రవాణాకు ఉపయోగించే ట్రాలీలలో కూలీలను ప్రమాదకరంగా తరలిస్తుండటం వల్లే తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లకు సరైన లైట్లు లేకపోవడం, కనీస రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ అలవాట్లను తక్షణమే విడనాడాలని సూచించారు. తమ ప్రాణాల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఇకనుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల్లో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తామన్నారు. గతంలో మాదిరిగా కేవలం జరిమానాలతో సరిపెట్టబోమని, నెంబర్ ప్లేట్ లేకపోయినా, సరిగ్గా కనిపించకపోయినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

‘రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజా చైతన్యమే కీలకం’
నేరాల నియంత్రణ, భద్రత కోసం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రమాదాల నివారణకు గ్రామాల్లో ‘విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు’ ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణలో ప్రజలకు, యువతకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ కమిటీలు గ్రామాల్లో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయి నుంచి ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, గత రెండేళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో గంజాయిని పట్టుకున్నామని ఎస్పీ వెల్లడించారు. గ్రామాల్లో గంజాయి రవాణా, వినియోగంపై ప్రజా ప్రతినిధులు నిఘా పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యాశే సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధం. గుర్తు తెలియని లింకులను ఓపెన్ చేస్తే ఖాతాల్లోని నగదు క్షణాల్లో ఖాళీ అవుతుంది, అని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కానీ, స్థానిక పోలీసులకు కానీ ఫిర్యాదు చేస్తే.. పోయిన నగదును వెంటనే రికవరీ చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మోటార్ వాహనాల అధికారి వెంకటరమణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎస్ఐ రవి, ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.