రామవరం, ఆగస్టు 16 : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం జనరల్ సెక్రెటరీ మడిపల్లి కరుణాకర్ అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 22న చేపట్టే చలో ప్రజా భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెం ఏరియా కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా కాంట్రాక్ట్ కార్మికుల విభాగం ఉపాధ్యక్షుడు గూడేల్లి యాకయ్య మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ వారికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. వారు అర్ధాకలితో అలమటిస్తున్నారని, వారి ఆవేదనను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ తాండ్ర విజయ్, బోట్ల ప్రభాకర్, నిట్ట రవి, డి.శ్రీను స్వామి, చిట్టి రాంబాయి, రాజేశ్వరి, విజయ, మేకల శ్రీనివాస్, ఆదాము, హుస్సేను, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.