జూలూరుపాడు, సెప్టెంబర్ 24 : సైబర్ నేరగాళ్ల బారిన పడి ఓ గిరిజన రైతు రూ.10 వేలు కోల్పోయిన సంఘటన జూలూరుపాడు మండలంలో జరిగింది. సాయిరాంతండాకు చెందిన గిరిజన రైతు భూక్య కిషన్ జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్నాడు. ఖాతాలో రూ.10,460 ఉన్నాయి. గత మూడు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను, మీ ఖాతా నిలుపుదల అయ్యే అవకాశం ఉంది, ఖాతా తీసుకునే సమయంలో పూర్తి వివరాలు ఇవ్వలేదు కావునా వివరాలు తెలుపాలంటూ అడిగాడు. దీంతో రైతు స్థానికంగా ఉన్న బ్యాంక్‌కు వెళ్లి వివరాలు తెలుసుకుంటానని చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సైబర్ నేరగాడు మళ్లీ ఫోన్ చేయగా రైతు భార్య లీల లిఫ్ట్ చేసి మాట్లాడింది. తాను హెడ్ ఆఫీస్ లో ఎంప్లాయి అని తన పేరు ఆకాశ వర్మ అని ఐడీ కార్డును వాట్సాప్ ద్వారా పంపించాడు. ఇది చూసిన లీల నిజంగా బ్యాంక్ ఉద్యోగి అనుకుని చెప్పండి సార్ అంటూ బదులిచ్చింది.
మీ బ్యాంక్ ఖాతా ప్రాసెస్ ను పూర్తి చేస్తున్నాను మీకు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలంటూ పేర్కొన్నాడు. ఆలోచించకుండా వచ్చిన ఐదు అంకెల ఓటీపీ నంబర్ ను చెప్పింది. దీంతో ఖాతాలో ఉన్న రూ.10 వేల నగదు విత్ డ్రా చేసినట్టుగా ఫోన్ కు క్షణాల్లో మెసేజ్ రావడంతో కంగుతింది. విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా లబోదిబోమంటూ బ్యాంక్ వద్దకు వెళ్లి అధికారులకు చెప్పారు. ఇది సైబర్ నేరగాడి పని అని, మీరు సైబర్ బారిన పడ్డారని బ్యాంక్ అధికారులు తెలిపి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించడంతో రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు. కష్ట కాలంలో పెట్టుబడి అవసరాలకు ఉపయోగపడుతుందని, తిని తినక పొదుపు చేసుకున్న డబ్బు ఖాతా నుండి మాయం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రైతు.