– పీపీఏ బృందానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు లేఖ అందజేసిన బీఆర్ఎస్ నేతలు
బూర్గంపహాడ్, జూన్ 04 : పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంతో భద్రాచలం ఏజన్సీతో పాటు బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల ప్రజలు లక్షలాది మందికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని…ముంపు సమస్యకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం(పీపీఏ) రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ముంపు సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలో భద్రాచలం, బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు బీఆర్ఎస్ నేతలతో కలిసి గురువారం సారపాక ఇటీసీ అతిథిగృహంలో బృందం సభ్యులకు లేఖ (వినతిపత్రం) అందజేశారు. పోలవరం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రభావం కారణంగా భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో పలు ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతమైన సారపాక, ఐటీసీ పేపర్ల్బోర్డు, స్పెషాలిటీ పేపర్స్ డివిజన్(5 వేల కుటుంబాలకు ఆధారం), అశ్వాపురంలోని హెవీ బాటల్స్టాంట్, దుమ్ముగూడెంలో హైడల్ ప్రాజెక్టు, పరిసర గ్రామాలు, నివాస ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.
అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ పూర్తి చేయడం, స్పిల్‌వేతో నదీ ప్రవాహాలను మళ్లించడం 2021లో బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధించి ప్రాజెక్టు సమర్థవంతంగా అమలులోకి వచ్చిందని… 2022 వరదల సమయంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలం, బూర్గంపహాడ్, సారపాక ఇతర గ్రామాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు తీవ్ర వరదలను ఎదుర్కొన్నాయన్నారు. భద్రాచలం వద్ద సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యుసీ) గేజ్ రికార్డుల ప్రకారం జూలై 2022లో గరిష్ట వరద స్థాయి 54.18 మీటర్లు (177.73 అడుగులు) చేరుకోగా ఆ కాలంలో సంభవించిన విస్తృత విధ్వంసం నుంచి ప్రజలు అనుభవించిన వరద విధ్వంసం, నష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఈ బ్యాక్ వాటర్ ప్రేరేపిత వరదల కారణంగా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో లక్షమందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని, అంతేకాకుండా 40శాతం నీటమునిగిందని, 2 వేల కుటుంబాలు మునిగిపోవడం వల్ల పదే పదే వరద ప్రభావం ఈ ప్రాంతంపై పడుతూనే ఉందని ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే నేటికీ పోలవరం ముంపు బాధితులకు జరిగిన నష్టం అంచనా వేయలేదని.. పరిహారం ఇవ్వలేదని స్పష్టమైంది.
ప్రస్తుతం పోలవరం నిర్వహణతో ఏడాది పొడవునా హెచ్చరిక స్థాయి పరిస్థితులు కొనసాగుతాయని, దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాలు పదే పదే ప్రమాదాలకు గురవుతాయని బ్యాక్ వాటర్ స్థాయి సూచిస్తుందన్నారు. పోలవరం కాపర్ డ్యామ్ పూర్తయిన తర్వాత నమోదైన వరద స్థాయి బట్టి ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. 2021 వరదస్థాయి 27.43 మీటర్లు, 2022లో 54.88 మీటర్లు, 2023లో 43.70 మీటర్లు, 2024లో 48.04 మీటర్లు, 2025లో 48.58 మీటర్లుగా గణాంకాలు తెలంగాణలో భద్రాచలం, ఇతర ఎగువ ప్రాంతాలపై పోలవరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న ఎరుగుతున్న ప్రభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుందని పేర్కొన్నారు. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ భద్రాచలం తూర్పు, పడమర వైపు వరద ఒడ్డులను అధిగమించడం ద్వారా నీరు భద్రాచలం పట్టణంలోకి ప్రవేశిస్తుందని.. దీంతో ప్రమాదకర ప్రాంతాలను కవర్ చేయడానికి వరద ఒడ్డులను విస్తరించడం, బలోపేతం చేయడం తక్షణ అవసరంగా పేర్కొన్నారు. బూర్గంపహాడ్‌లో భూముల ముంపునకు గురవుతున్న బాధిత ప్రజలకు తక్షణ పరిహారం అందించడం, గోదావరి, కిన్నెరసాని నదుల వెంబడి బ్యాక్ వాటర్ ప్రభావం నుంచి గ్రామాన్ని రక్షించడం అవసరమన్నారు. హైదరాబాద్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీలు, వ్యాప్స్, సెకో, ఇతర నిపుణుల ఏజెన్సీలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం 38 గ్రామాల్లో విస్తరించి ఉన్న 184 చదరపు కిలోమీటర్లు పోలవరం ప్రాజెక్టు నుంచి ఉత్పన్నమయ్యే బ్యాక్ వాటర్ ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉందని ఆ లేఖలో గుర్తుచేశారు.
ప్రధానంగా భద్రాచలం, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లో 2022 బ్యాక్‌వాటర్ ప్రేరేపిత వరదల వల్ల నష్టపోయిన లక్ష మందికి పైగా ప్రజలకు తక్షణ పరిహారం, బ్యాక్ వాటర్‌తో 2వేల కుటుంబాలకు పరిహారం, పునరావాసం, శుద్ధిచేసిన మురికినీటిని గోదావరిలోకి పంపింగ్ కోసం పంపింగ్ స్టేషన్లు, ట్రీట్ మెంట్ ప్లాంట్లు తక్షణం నిర్మించాలని, 5 కిలోమీటర్ల పొడవునా వరద ఒడ్డులను నిర్మించి భద్రాచలం వైపు వరద రక్షణ కట్టలను బలోపేతం చేయడం, పెంచడం చేయాలని, బూర్గంపహాడ్‌లో శాశ్వత ముంపులో భూములు కోల్పోయే గ్రామస్థులకు పరిహారం ఇవ్వాలని, బూర్గంపహాడ్, సారపాక ప్రభావిత ప్రాంతాల్లో వరద బ్యాంకుల నిర్మాణం, సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలనే ప్రధాన డిమాండ్లను పీపీఏ బృందానికి లేఖ ద్వారా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం సమస్యలను అత్యంత సీరియస్ గా పరిగణించి పై డిమాండ్లపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
పీపీఏ బృందానికి లేఖను అందించిన వారిలో భద్రాచలం ఇన్చార్జ్ మానే రామకృష్ణ, కోటగిరి ప్రబోద్‌కుమార్, రేపాక పూర్ణచందర్రావు, బూర్గంపహాడ్ నుంచి మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, మాజీ సర్పంచ్ సిరిపురం స్వప్న, బొల్లు సాంబ, పాటి అశోక్, మేడిగం లక్ష్మినారాయణరెడ్డి, కృష్ణ, శ్రీను, అశ్వాపురం నుంచి మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, సూదిరెడ్డి గోపిరెడ్డి, వెన్న అశోరకుమార్, శివారపు డాక్టర్ బాబు, మణుగూరు నుంచి మండల అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, యాదగిరి గౌడ్లతో పాటు నాలుగు మండలాలకు చెందిన నాయకులు పెద్దసంఖ్యలో ఉన్నారు.