– శిక్షణకే పరిమితం చేయాలని యాజమాన్యం కఠిన ఆదేశాలు
– అన్ని ఏరియా సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు
రుద్రంపూర్, మార్చి 25 : సింగరేణి సంస్థలో అప్రెంటిస్ల నియామకం, పనుల విషయంలో కీలక మార్గదర్శకాలను మానవ వనరుల అభివృద్ధి (HRD) విభాగం జారీ చేసింది. ఈ నెల 23న అన్ని ఏరియా సంబంధిత శాఖ అధికారులకు ఈ మేరకు లేఖలు పంపినట్లు సమాచారం. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పరిధిలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్, అసిస్టెంట్ అప్రెంటిస్షిప్ అడ్వైజర్ నుండి అందిన సమాచారంలో, కొన్ని సింగరేణి యూనిట్లలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు, అప్రెంటిస్ ట్రైనీలను శారీరక శ్రమతో కూడిన పనుల్లో నిమగ్నం చేస్తున్నట్లు వెల్లడైనట్లు పేర్కొన్నారు. అలాగే కొందరు ట్రైనీలు కఠిన ప్రవర్తనను ఎదుర్కొంటున్నారని, సరైన అభ్యాస వాతావరణం లేకపోవడంతో వారు ఒత్తిడికి గురవుతున్నట్లు నివేదికల్లో వెల్లడైనట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అప్రెంటిస్ చట్టం మరియు సంబంధిత మార్గదర్శకాల ప్రకారం అప్రెంటిస్లను కేవలం శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నిత్యకృత్య లేదా శ్రమతో కూడిన పనులకు నియమించరాదని సంస్థ స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటిఐ అప్రెంటిస్లకు వారి పాఠ్యప్రణాళిక, అధ్యయన రంగానికి అనుగుణంగా ఉండే సాంకేతిక శిక్షణ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనేలా చూడాలని, సంబంధిత గనులు మరియు శాఖల విభాగాధిపతులకు (HODs) సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా అప్రెంటిస్లకు సురక్షితమైన, సహాయక మరియు అభ్యాసకేంద్రీకృత వాతావరణాన్ని తప్పనిసరిగా కల్పించాలని పేర్కొంది.
అప్రెంటిస్ల నియామకం చట్టబద్ధమైన పర్యవేక్షణలో, సీనియర్ లేదా రెగ్యులర్ సాంకేతిక సిబ్బందితో కలిసి జరిగేలా నిర్ధారించాలని కూడా సంస్థ స్పష్టం చేసింది. ఈ ఆదేశాల భాగంగా జీఎం సేఫ్టీ కార్పొరేట్, జీఎం సేఫ్టీ ఆల్ రీజియన్స్, ఏఎస్ఓ సేఫ్టీ ఆల్ ఏరియాస్, అలాగే అన్ని ఏరియాలలోని ఎం.వి.టి.సి ట్రైనింగ్ మేనేజర్లకు హెచ్ఆర్డి విభాగం నుంచి లేఖలు పంపినట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయంతో అప్రెంటిషిప్ విద్యార్థుల చేత ఇప్పటివరకు చేయించబడుతున్న శ్రమ పనులకు ముగింపు లభించినట్లే అని కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.