Badradri Kothagudem | అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని తారు రోడ్డు మట్టి రోడ్డుగా దర్శనమిస్తోంది. ఒకవైపు వాయు కాలుష్యం మరోవైపు వాహన రాకపోకలతో లేస్తున్న దుమ్ముతో ప్రజలు ఉక్కురిబిక్కిరవుతున్నారు. రోడ్డుపై చేరిన మట్టిని తొలగించేందుకు నిధులు లేవని పంచాయతీ అధికారులు చేతులెత్తేయగా మా పరిధిలోకి రాదంటూ ఆర్అండ్బి అధికారులు ముఖం చాటేస్తుండటంతో మండల కేంద్రంలోని రహదారికిరువైపులా ఉన్న ప్రజలు, వ్యాపారులు దుమ్ము, వాహన కాలుష్యంతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.
సంవత్సరాల తరబడి రోడ్డుపై దుమ్ము లేస్తుందని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్ను, వ్యాపార లైసెన్సుల పేరిట ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న పంచాయతీ అధికారులు రోడ్డుపై దుమ్మును తొలగించడంలో మాత్రం శ్రద్ధ వహించడం లేదని వ్యాపారులు అధికారులపై మండిపడుతున్నారు. తారు రోడ్డుపై ఇరువైపులా సగానికి పైగా మట్టి చేరడంతో వాహన రాకపోకలతో దుమ్ము లేవడంతో ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార గృహ సముదాయాల వారు దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో..
రోడ్డుపై చేరిన మట్టి చిన్నపాటి కంకర రాళ్లతో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మండల ప్రజలు పేర్కొంటున్నారు. నిత్యం ప్రధాన రహదారిపై వేలాదిగా వాహన రాకపోకలు సాగిస్తుండటంతో పైకి లేస్తున్న దుమ్ముతో వెనుక వస్తున్న వాహనాలు సైతం కనిపించకుండా పోతున్నాయి. రహదారికి పక్కన వ్యాపారులు విక్రయిస్తున్న తినుబండారాలపై దుమ్ము పేరుకు పోతోంది. నిత్యం దుమ్మును పీలుస్తున్న ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీటీ రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
Manchireddy Kishan Reddy | దమ్ముంటే రైతులకు ఫార్మాసిటీ భూములిప్పించండి : మంచిరెడ్డి కిషన్రెడ్డి
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు