Harish Rao | హైదరాబాద్‌లోని ఆదిభట్లలో మరో రియల్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, నేడు ఆదిభట్లలో నరసింహ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమని అన్నారు. రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగానికి చేరడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలన పాపం అన్ని రంగాలకు శాపంగా మారిందని హరీశ్‌రావు అన్నారు. ఎంతోమంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతం ఎంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అన్నట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా నిలిచిందని అన్నారు.
గడిచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు విమర్శించారు. నిజాన్ని దాచిపెడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశలో వెళ్తుంది అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప చేస్తుందేమీ లేదని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు.. మీకు ఈ విషయాలు ఎందుకు అర్థం కావడం లేదని నిలదీశారు. హైదరాబాద్ బాగుంటేనే, తెలంగాణ బాగుటుంది, అభివృద్ధి సాధ్యం అవుతుందన్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు.
హైడ్రా, మూసీ, ఫార్మా సిటీ, మెట్రో లైన్ మార్పు వంటి అంశాల్లో మీ అనాలోచిత నిర్ణయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో డిజాస్టర్‌ను తెచ్చాయని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్‌రావు అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న ఆత్మహత్యలకు మీరే బాధ్యులు అని మండిపడ్డారు. మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. భేషజాలకు పోకుండా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ, తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నరసింహ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.