కొల్లాపూర్,ఫిబ్రవరి 09 : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా నాగర్ కర్నూల్(Nagar Kurnool) జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం రామపురం గ్రామంలో రచ్చబండ పై ఆదివారం ఓ యువకుడు నిరాహారదీక్ష(Hunger strik) చేపట్టారు. ప్రజాసమస్యలు అమలుకు నోచుకోనందుకు నిరసనగా సామాజిక బాధ్యతగా ప్రజా ఆవేదన నిరాహార దీక్ష చేపట్టినట్లు యువకుడు ఆకునమోని చంద్రయ్య యాదవ్ తెలిపారు. స్థానికంగా గ్రామాల్లో తిష్ట వేసిన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.
మా గ్రామంలోని రైతు వేదికలో గ్రామ రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి రుణమాఫీ పక్రియను ప్రారంభించారు. కానీ మా గ్రామంలోని రైతులకే రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో చాలా భూములకు రైతు భరోసా రాకుండా సర్వే రికార్డ్ లో నమోదు చేశారన్నారు. రైతు భరోసా రాకపోవడంతో యాసంగి పంటలను బీడుగా పెట్టుకున్నారని, గత పది ఏండ్ల కాలంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పెట్టుబడి సహాయం అందక బీడుగా పెట్టుకున్న చరిత్ర లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే మరో ఉధృత పోరాటానికి సిద్ధమవుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యువకుడు చేపట్టిన ప్రజా ఆవేదన నిరాహార దీక్షకు గ్రామస్తులతో పాటు ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.