UPSC CSE Results | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2025 తుది ఫలితాల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పండింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష తుది ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 25 మందికి పైగా అభ్యర్థులు ఎంపిక కావడం విశేషం.
జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకర్‌గా రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లా రవత్భాటాకు చెందిన అనూజ్ అగ్నిహోత్రి నిలిచారు. అగ్నిహోత్రి అదే రాష్ట్రంలోని జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివాడు. మూడో ప్రయత్నంలో సివిల్స్ టాపర్‌గా నిలిచాడు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ పూర్తిచేసిన రాజేశ్వరి సూవే ద్వితీయ ర్యాంకు సాధించింది. ఆమె తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా సోషియాలజీని ఎంచుకున్నది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంక్‌తో రాష్ట్రం నుంచి అత్యుత్తమ జాతీయ ర్యాంకు సాధించి సత్తాచాటింది. సింగరేణి కార్మికుడి కుమార్తె అయిన సృజన గ్రూప్-1 ఫలితాల్లోనూ సత్తాచాటి ప్రస్తుతం ఉద్యోగ శిక్షణ పొందుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన అట్ల తరుణ్‌తేజ 123వ ర్యాంక్‌తో సత్తాచాటాడు. జిల్లాలవారీగా తీసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఏకంగా 8 మంది ఉద్యోగాలు పొందారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచీ 8 మంది ఉద్యోగాలు సాధించడం విశేషం.

సివిల్స్ అభ్యర్థులకు సింగరేణి సంస్థ అందించిన చేయూత ఫలించింది. సివిల్స్ తుది ఫలితాల్లో 20 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సివిల్స్ అభ్యర్థుల కోసం సింగరేణి సంస్థ రాజీవ్ అభయహస్తం పథకాన్ని అమలుచేస్తున్నది. సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద అభ్యర్థులకు ఆర్థికసాయం అందిస్తున్నది. ఈసారి ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయి మెయిన్స్‌కు అర్హత సాధించిన 202 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున సంస్థ నుంచి ఆర్థిక సహాయం అందించారు. వీరిలో 51 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో 20 మంది ఉద్యోగాలు పొందడం విశేషం. ప్రస్తుత ఫలితాల్లో 10 మంది ఓబీసీ అభ్యర్థులు, నలుగురు ఎస్టీ అభ్యర్థులు, ముగ్గురి చొప్పున ఎస్సీ, జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు, మొత్తంగా 16 మంది పురుష అభ్యర్థులు, నలుగురు మహిళా అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. యూపీఎస్సీ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. సింగరేణి ఉద్యోగి రాజేశం కుమార్తె జి సృజన జాతీయ స్థాయిలో 55వ ర్యాంకు సాధించడంపై సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి హర్షం వ్యక్తంచేశారు. సివిల్స్ విజేతలకు అభినందనలు తెలిపారు.
యూపీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఇద్దరు అభ్యర్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఆశీష్ 676వ ర్యాంక్, ములుగు జిల్లాకు చెందిన డీ ప్రవీణ్‌కుమార్ 793వ ర్యాంక్ సాధించారు. వారికి ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ మేరకు ఆ ఇద్దరు విజేతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఎస్సీ స్టడీ సరిల్లో శిక్షణ పొందిన 27 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారని, వారిలో ఏడుగురు ఇంటర్వ్యూకు హాజరయ్యారని, తుదకు ఇద్దరు ఎంపికయ్యారని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ఇద్దరు విజేతలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, కమిషనర్ విజయేంద్ర అభినందనలు తెలిపారు.
రామగిరి, మార్చి 7: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామ పంచాయతీ సెంటినరీ కాలనీకి చెందిన గుడెల్లి సృజన సివిల్స్‌లో 55వ ర్యాంకుతో రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచి సత్తా చాటారు. సృజన తండ్రి రాజేశం సింగరేణి జనరల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజేశం, రాణి దంపతుల రెండో సంతానమైన సృజన సెంటినరీ కాలనీలోని వాణి ఇంగ్లిష్ మీడియంలో ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు చదివింది. ఇంటర్ శ్రీ చైతన్య కళాశాల హైదారాబాద్, మంథని జేఎన్టీయూలో ఇంజినీరింగ్ సీఎస్ఈ పూర్తిచేసి ఢిల్లీలోని ఐఏఎస్ అకాడమీలో సివిల్ కోచింగ్ తీసుకున్నది. ఆమె ఇటీవలి గ్రూప్-1 పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. సింగరేణి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన సృజన ఈ విజయంతో గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
నమస్తేతెలంగాణ నెట్వర్క్, వరంగల్, మార్చి 6: సివిల్స్ ఫలితాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు విశేష ప్రతిభ చాటారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన అట్ల రవీందర్, అమరావతి దంపతుల కుమారుడు అట్ల తరుణ్ తేజ జాతీయ స్థాయిలో 123వర్యాంకు సాధించాడు. ఆ దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం విశేషం. తరుణ్ తేజ ఐఐటీ ముంబైలో బీటెక్ (సీఎస్సీ) కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాడు. 2024లో ఇండియన్ సివిల్ సర్వీస్‌లో 770 ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్)లో ఉన్నతాధికారిగా ఉద్యోగంలో చేరి, విధులకు సెలవు పెట్టాడు. మళ్లీ సివిల్స్ కోసం రోజూ 10 గంటలకు పైగా చదువుతూ తాజా ఫలితాల్లో సత్తాచాటాడు.
మెదక్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రావణ్‌కుమార్ ఎలాంటి శిక్షణ పొందకుండా తన స్వయంకృషితో సివిల్స్ తుది ఫలితాల్లో 768వ ర్యాంక్ సాధించి సత్తాచాటారు. ఆయన తండ్రి కుమ్మరి యాదగిరి రైతు. తల్లి కుమ్మరి జ్యోతి మూడేండ్ల క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఆయన ఇటీవలి గ్రూప్-1 ఫలితాల్లో సీటీవోగా ఎంపికై శిక్షణలో ఉన్నారు. ఎక్కడా శిక్షణ పొందలేదని, హైదరాబాద్‌లో ఉండి సొంతంగా ప్రిపేర్ అయినట్టు శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాసిన ఆయన ఆరోసారి ర్యాంకు సాధించారు.
గత యూపీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ఐఆర్ఎస్ అధికారిగా ఎంపికై శిక్షణ పొందుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మరోసారి సివిల్స్‌లో సత్తాచాటారు. యూపీఎస్సీ తాజా ఫలితా ల్లో 939వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఆయన నాగపూర్‌లో ఐఆర్ఎస్
శిక్షణ పొందుతున్నాడు.
భీమ్‌గల్, మార్చి 6: యూపీఎస్సీ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్‌రెడ్డి సత్తాచాటాడు. శనిగరం నవీన్‌రెడ్డి కుటుంబం వ్యాపారరీత్యా హైదరాబాద్‌కు వలస వెళ్లింది. ఆయన కుమారుడైన వర్షిత్‌రెడ్డి శుక్రవారం వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో 259 ర్యాంకు
సాధించినట్టు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామానికి చెందిన యువకుడికి సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మూసాపేట, మార్చి 6: నాన్న కలగన్నాడు.. కొడుకు నెరవేర్చాడు.. ఇది పాలమూరు బిడ్డ వెంకటేశ్ ప్రసాద్సాగర్ సాధించిన ఘనత. మూడు పర్యాయాలు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినా మొక్కవోని దీక్షతో సవాళ్లను ఎదుర్కొని.. అదే పరీక్షల్లో నాలుగో ప్రయత్నంలో సివిల్స్ తుది ఫలితాల్లో ఆలిండియా 358వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతల్లో ఉన్న ప్రసాద్సాగర్ది మహబూబ్‌నగర్ జిల్లా మూ సాపేట మండలం నిజాలాపూర్ గ్రామం. ఆయన తండ్రి సత్తయ్య విద్యుత్తు శాఖలో ఏఈగా పనిచేస్తుండగా, తల్లి యశోద గృహిణి. సత్తయ్య తన కొడుకును చిన్నప్పటి నుంచే ఐఏఎస్ చేయాలని కలలుగన్నాడు. విద్యుత్తు శాఖలో జేఎల్ఎంగా 2007లో చేరిన ఆయన.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను చూసి తన పిల్లలు కూడా ఇలా ఎదగాలని కోరుకున్నాడు. కొడుకు డిగ్రీ చదువుతుండగానే ఐఏఎస్ లక్ష్యంగా చదవాలి బిడ్డా.. అని నూరిపోశాడు. ఆ దిశగా మార్గనిర్దేశం చేశాడు. తోడ్పాటును అందిస్తూ ప్రోత్సహించాడు. ఉన్న ఊరికి కన్నవారికి మంచి పేరు తేవాలని సూచించాడు. దానికి ప్రతిఫలమే నేడు వెంకటేశ్‌ప్రసాద్ సాగర్ సాధించిన విజయం.
జగిత్యాల, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సర్కార్ పాఠశాలలో చదివిన విద్యార్థి సివిల్స్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి సెంట్రల్ సర్వీసెస్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. జగిత్యాల అర్బన్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి రాహుల్ జాతీయ స్థాయిలో 748వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. మల్లేశం-గంగలక్ష్మి దంపతుల కుమారుడైన రాహుల్ పాఠశాల విద్యను జగిత్యాల, పొరండ్లలో చదివాడు. ఆతర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాడు. నాలుగేండ్లుగా యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. గతంలో రెండుసార్లు విఫలమైన ఆయన మూడో ప్రయత్నంలో సాధించాడు. జాతీయ స్థాయిలో రైల్వే, డిఫెన్స్, ఇండస్ట్రీస్ తదితర సర్వీసుల్లో గ్రూప్ 1 స్థాయి అధికారి పోస్టు వచ్చే అవకాశం ఉన్నట్టు రాహుల్ చెప్తున్నాడు. కాగా ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధించే వరకు మళ్లీ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రాహుల్ ప్రతినబూనడం విశేషం.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని కొత్తూరుకు చెందిన అనిశెట్టి ఆశీష్ సివిల్స్‌లో 676 ర్యాంకు సాధించాడు. తండ్రి అనిశెట్టి రమేశ్ వ్యాపారి. తల్లి అనిశెట్టి శ్రీలత గృహిణి. ఆశీష్ తేజస్వీ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. హైదరాబాద్‌లోని నారాయణలో ఇంటర్, హిందూ కాలేజీ (ఢిల్లీ యూనివర్సిటీ) బీఏ
హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో పూర్తిచేశాడు. అనంతరం అక్కడే కోచింగ్ తీసుకున్నాడు. కలెక్టర్ కావాలని తన లక్ష్యం కోసం పట్టుదలతో, కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించాడు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటకు చెందిన గుండు అఖిలేశ్ తాజా సివిల్స్ ఫలితాల్లో 464 ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. అఖిలేశ్ తండ్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సరస్వతి గృహిణి. అఖిలేశ్ 2013లో హనుమకొండ హంటర్
రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి, ఎస్సార్ కళాశాలలో ఇంటర్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివాడు.
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన బానోత్ భరత్‌కుమార్‌కు ఎస్టీ క్యాటగిరీలో ఆలిండియా 900 ర్యాంకు దక్కింది. గత యూపీఎస్సీ వెల్లడించిన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో భరత్‌కుమార్ ఆలిండియా 135వ ర్యాంకు సాధించి ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఇండియన్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. భరత్‌కుమార్
స్వస్థలం నర్మెట మండలం మచ్చుపహాడ్ గ్రామం. తండ్రి దస్రూనాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా జనగామలో స్థిరపడ్డారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ యూపీఎస్సీ ఫలితాల్లో 793వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. ఇటీవలి గ్రూపు-1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించి, డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం డీఎస్పీ శిక్షణలో ఉంటూ యూపీఎస్సీ
పరీక్షలు రాశాడు. ప్రవీణ్‌కుమార్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులైన దైనంపల్లి సమ్మయ్య, రజితను కోల్పోయాడు. వారిద్దరూ కూలిపనులు చేసుకొనే వారు. ఆ తర్వాత ప్రవీణ్‌కుమార్ నాన్నమ్మలైన సమ్మక్క, ఎల్లమ్మ వద్ద పెరిగాడు. పట్టుదలతో చదువుకొని యూపీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించాడు.
మర్కూక్, మార్చి 6: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా విధులు నిర్వహిస్తున్న ఉమ్మడి హనుమకొండ జిల్లాకు చెందిన బేతి విక్రమ్ శుక్రవారం విడుదలైన సివిల్స్ తుది ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 472వ ర్యాంక్ సాధించాడు. మండల ప్రజలు, సహోద్యోగులు హర్షం వ్యక్తం
చేశారు. స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. విక్రమ్‌ది హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి స్వగ్రామం. బేతి అరుణ, మల్లేశం దంపతుల కుమారుడైన విక్రమ్ బీటెక్ పూర్తిచేశాడు.
నేను పడ్డ కష్టం, అదృష్టం కలగలసి ఈ ఫలితాన్ని నాకు అందచేశాయి. ఫలితాన్ని చూసి నా కండ్లను నేనే నమ్మలేకపోయాను. టాప్ ర్యాంక్ సాధిస్తానని నేను ఊహించలేదు. నేను చాలా అదృష్టవంతుడినని భావిస్తాను. ఈ అదృష్టాన్ని ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు. సీనియర్లు, సహ విద్యార్థులు ఇచ్చిన మద్దతు కూడా నా కృషికి తోడ్పడింది. ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్‌లో నాపైన పనిభారం పడకుండా నేను సివిల్స్‌కు తయారయ్యేందుకు సహకరించారు. రోజుకు 8, 9 గంటలు చదివేవాడిని. మొదటి రెండు ప్రయత్నాలు ఫలప్రదం కాకపోయినా మూడవ ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించగలిగాను.
– అనూజ్ అగ్నిహోత్రి, జాతీయ టాప్ ర్యాంకర్
