UPSC CSE Results | న్యూఢిల్లీ, మార్చి 6: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాల్లో పురుషులే అత్యధిక ర్యాంకులు సాధించారు. మొత్తం 958 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు కాగా, వీరిలో 659 మంది పురుషులు, 299 మంది మహిళలు ఉన్నారు. టాప్-5లో నలుగురు పురుషులు ఉండగా, ఒక మహిళ మాత్రమే ఉన్నారు. టాప్-25లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. వీరిని వివిధ కేంద్ర సివిల్ సర్వీసెస్‌లో నియామకాలకు సిఫార్సు చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. ఎయిమ్స్ గ్రాడ్యుయేట్ అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు.
తమిళనాడుకు చెందిన రాజేశ్వరి సూవె ద్వితీయ ర్యాంకును సాధించగా, ఆకాన్ష్ ధుల్ తృతీయ ర్యాంకు సాధించాడు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పట్టభద్రుడైన ఆకాన్ష్ ధుల్ కామర్స్, అకౌంటెన్సీని తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. నాలుగో ర్యాంకును రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా, ఐదో ర్యాంకును ఇషాన్ భట్నాగర్ సాధించాడు. ఝున్‌ఝున్‌వాలా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో బీఏ చదివాడు. ఐదో ర్యాంకు సాధించిన భట్నాగర్ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేశాడు.
ఏడేండ్ల కఠిన శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నా విజయానికి మెట్లు. 2017లో బీఈ పూర్తి చేసిన వెంటనే సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా చదవడం ప్రారంభించాను. దాదాపు పదేండ్లుగా దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టాను. తమిళనాడు స్టేట్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్ ట్రెయినీగా ప్రస్తుతం పనిచేస్తున్నప్పటికీ సివిల్ సర్వీసెస్‌ను సాధించడమే ఏకైక లక్ష్యంగా కష్టపడ్డాను. గత ప్రయత్నాల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ చేసిన కృషి ఇప్పుడు టాప్ 2 ర్యాంకర్‌గా నన్ను నిలబెట్టింది. నా కుటుంబం ఇచ్చిన మద్దతే నా ప్రధాన బలం. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం. సమాజంలో చివరి అంచున నిలబడ్డ వ్యక్తికి సైతం ప్రభుత్వ సేవలు అందేలా చూస్తా.
– రాజేశ్వరి సూవే, జాతీయ 2వ ర్యాంకర్