UPSC CSE Results | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీస్ తర్వాత అంతటి ప్రాధాన్యం గల గ్రూప్-1లో కొన్ని పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్ కానున్నాయా..? దాదాపు 20 వరకు పోస్టులు ఖాళీకానున్నాయా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. గ్రూప్-1 ఉద్యోగాలు పొందినవారు తాజాగా సివిల్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలవడంతో ఈ పరిస్థితి తలెత్తనున్నది. శుక్రవారం విడుదలైన సివిల్స్ తుది ఫలితాల్లో 20 మంది వరకు గ్రూప్-1 విజేతలు ఎంపికయ్యారు.
55వ ర్యాంకర్ గుడెల్లి సృజన డీఎస్పీ పోస్టుకు ఎంపికై శిక్షణపొందుతున్నారు. 150వ ర్యాంకర్ కొలిపాక శ్రీకృష్ణ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. 358వ ర్యాంకు సాధించిన ఎం వెంకటప్రసాద్ సాగర్ కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్టులో ఉన్నారు. డీ ప్రవీణ్ డీఎస్పీగా, ఇస్లావత్ శ్రీరామ్హర్ష, కట్టా ప్రత్యూష, విక్రమ్‌సింహారెడ్డి, విజయసింహారెడ్డి, శ్రావణ్‌కుమార్, బానోత్భరత్, బేతి విక్రమ్, నవీన్ సైతం గ్రూప్-1లోనూ విజేతలు కావడం గమనార్హం. వీరితోపాటు మరికొందరు సైతం సివిల్స్‌లో విజేతలుగా నిలిచారు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రూప్-1 ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి. గ్రూప్-1 నియామకాలు పలు వివాదాలతో అనేక మలుపులు తిరిగిన తర్వాత ఎట్టకేలకు సర్కార్ నియామకాలు పూర్తి చేసింది. తాజాగా సివిల్స్‌లో మళ్లీ ఆయా పోస్టులు ఖాళీ కానున్నాయి.