Manchireddy Kishan Reddy | యాచారం, ఫిబ్రవరి 9 : ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని, లేదంటే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తగిన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచినా గత ప్రభుత్వం ఫార్మా భూ బాధితులకు ఇచ్చిన ప్లాట్లను నేటికి ఎందుకు పంపిణీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని రైతులకు చెప్పిన రేవంత్ సర్కార్ హైకోర్టులో మాత్రం మేము ఫార్మాసిటి ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికే నాలుగు ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం అనుమతులిచ్చినట్లు ఆయన తెలిపారు. యాచారంలో 2,200ల ఎకరాలకు సంబంధించిన భూమిని టీఎస్ఐఐసీ తొలగించి కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి వెంటనే రైతల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు రైతులను నమ్మించిన భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, కోదండరాం, కోదండరెడ్డి, తీన్మార్ మల్లన్నలు నేడు రైతులు ఆందోళనలు చేస్తుంటే ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఫార్మా బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. మొండిగౌరెల్లిలో మైనింగ్‌జోన్ వద్దన్న కాంగ్రెస్ నేడు అనుమతులివ్వాలని చూస్తుందని, ఏదిఏమైనా మైనింగ్ రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలనకు బదులుగా రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హాయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయుకలు ప్రారంభోత్సవాలు చేసి పోటోలకు ఫోజులిస్తున్నారే తప్పా ఒక్క నూతన అభివృద్ధి పనిని నేటికి ప్రారంభించలేదన్నారు.
కాంగ్రెస్ నాయకులు అధికారులను, పోలీసులను బెదిరించి తమ పనులు చేయించుకుంటున్నట్లు ఆయన మండిపడ్డారు. ఇప్పటికి మామూళ్ల విషయంలో ఇబ్రహీంపట్నంలో ఎనిమిది మంది సీఐలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్దం కావాలన్నారు. మండలంలో మెజారిటిగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కృషి చేయాలన్నారు. కాంగ్రెన్‌ను చిత్తుగా ఓడించి పాతాళానికి తొక్కెయ్యాలని ఆయన కోరారు. ఇకపై ప్రతి గ్రామంలో విసృత స్థాయి సమావేశాలను నిర్వహించుకొని కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం, ఉత్సహం నింపాలన్నారు. అభ్యర్థులను గ్రామాలలో మీరే నియమించుకోవాలని, నియమించుకున్న అభ్యర్థులను మీరే గెలిపించుకోవాలని ఆయన సూచించారు. రానున్నది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పాచ్చ భాష, పీఏసీఎస్ చైర్మేన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మేన్ కారింగు యాదయ్య, మాజీ జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సహకారం సంఘం డైరెక్టర్లు స్వరూప, శశికళ, కళమ్మ, మాజీ సర్పంచ్‌లు రాజునాయక్, జగదీష్, కృష్ణ, హబీబుధ్దీన్, బోడ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు చిన్నొళ్ల యాదయ్య, నర్సింహరెడ్డి, పరికిషన్రెడ్డి, గుండాలు, ఖాజు, యాదయ్యగౌడ్, శివ, గోపాల్, వెంకటేష్, శంకర్‌నాయక్, లోహిత్‌రెడ్డి, ఆడాల గణేష్, దోస మహేష్, జానీ, జర్కోని రాజు, గరిగె శేఖర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.