Taapsee Pannu | సౌత్ సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని, తర్వాత హిందీ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్న ఆమె… ఇటీవల చేసిన వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తాప్సీ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఝుమ్మంది నాదం చిత్రంతో. దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులో వచ్చిన విజయాలే ఆమెకు బాలీవుడ్ వైపు అడుగులు వేసేలా చేసాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అక్కడ కూడా కథానాయికగా కాకుండా, కంటెంట్ ఆధారిత సినిమాలతో నటిగా తనను నిరూపించుకునే ప్రయత్నం చేసింది.
అయితే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తొలి తెలుగు సినిమా సమయంలో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కొంత హేళనగా మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సౌత్ సినిమాల వల్లే గుర్తింపు తెచ్చుకున్న నువ్వు, ఇప్పుడు అదే ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అంటూ పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ట్రోల్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో తాజాగా మరో ఇంటరాక్షన్లో తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్లో తెలుగు సినిమాల పాత్రను ప్రశంసించినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ సినిమాల కంటే, తెలుగు ఇండస్ట్రీ వల్లే తనకు ఎక్కువ ఆదరణ, గుర్తింపు వచ్చిందని ఆమె చెప్పినట్టు సమాచారం.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. కొందరు “తప్పు గ్రహించి మాట్లాడింది, మంచిదే” అంటుంటే, మరికొందరు “ఇది కేవలం ఇమేజ్ డ్యామేజ్ కంట్రోల్ మాత్రమే” అంటూ విమర్శిస్తున్నారు. సెలబ్రిటీల వ్యాఖ్యలు ఎప్పుడూ చర్చకు దారితీయడం సహజం. ముఖ్యంగా ఒక ప్రాంతంలో విజయాలు సాధించి, తర్వాత ఆ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు అభిమానులను బాధపెడతాయి. ఇప్పుడు తాప్సీ చేసిన ప్రశంసలను కొందరు సానుకూలంగా స్వీకరిస్తుంటే, మరికొందరు ఆమెని నమ్మడం లేదు. జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది… ఇప్పుడు మాట్లాడితే సరిపోతుందా? అని అంటున్నారు.