జూలూరుపాడు, ఏప్రిల్ 20 : జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఎంపీడీఓ తాళ్లూరి రవి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా వంట గదిని సందర్శించిన ఎంపీడీఓ విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న నిత్యావసర సరుకులు, వంట సామగ్రిని పరిశీలించి పురుగులు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వసతి గృహంలోని టాయిలెట్స్, స్నానపు గదులను సందర్శించి, పరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా నిత్యం బ్లీచింగ్ చల్లాలని, పారిశుధ్య నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని ఆదేశించారు.
వసతి గృహానికి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ వంటి రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరుకు అనుగుణంగానే మెనూ అమలు కావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారికి పలు కీలక సూచనలు చేస్తూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు అందాల్సిన అన్ని సదుపాయాలు సక్రమంగా అందేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

జూలూరుపాడు ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ