భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 31 : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన ధర్మపత్ని, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్ర, మనవళ్లు గంగుల సనవ్, గంగుల సౌరవ్ తో కలిసి మేడారం మహాజాతర సందర్భంగా శనివారం తెల్లవారుజామున ఆయన అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం, ప్రజలు పాడి పంటలు, శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలి అని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవార్లను వేడుకున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులను మంత్రి సీతక్క సత్కరించారు. ఆలయ ఈఓ వీరాస్వామి ఎంపీ రవిచంద్రకు శాలువా కప్పి, విజయలక్ష్మీకి చీరను బహుకరించి సన్మానించారు.