కొత్తగూడెం అర్బన్, జూన్ 15 : అత్యవసర పరిస్థితిలో సొంత ఖర్చులతో ప్రైవేటు దవాఖానల్లో వైద్యం చేయించుకున్న పేద వర్గాలకు ప్రభుత్వం ద్వారా అందించే ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ప్రతి ఒక్కరు అందుకునేవిధంగా సులభతరం చేయాలని, పథకం అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకానికి దరఖాస్తు చేసుకున్న 84మంది లబ్ధిదారులకు రూ.32.25లక్షల విలువచేసే చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన లబ్ధిదారులకు అందించి మాట్లాడారు.
ఇప్పటివరకు నియోజకవర్గంలో 1505 మందికి రూ.3.16కోట్ల విలువచేసే చెక్కులు అందించామని, 800 మందికి పంపిణీ కావాల్సివుందన్నారు. మరో 310మంది రోగులకు నిమ్స్ దవాఖాన ఎల్వోసీ ద్వారా ముందస్తు వైద్య ఖర్చులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. దవాఖానల యాజమాన్యాలకు ఈ పథకంపై ఎలాంటి అవగాహన లేకపోవంతో దరఖాస్తుదారులు నష్టపోవాల్సి వస్తోందని, వీరిపై ప్రభుత్వం చేర్యాలకు సిఫారసు చేయాలని కోరారు.
నిధి మంజూరులో ప్రభుత్వం పరిమితి విధించడం సరికాదని తక్షణమే పరిమితి ఎత్తివేసి పూర్తి బిల్లును చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, వి పూర్ణచందర్ రావు, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, నాయకులు యూసుఫ్, ధర్మరాజు, రామారావు, అప్పారావు, కూచిపూడి జగన్ తదితరులు పాల్గొన్నారు.